ఆ మాట వాస్తవమే.. కానీ అందులో ఎవరి ప్రమేయం లేదు: ఆర్టీసీ ఎండీ ద్వారకా RTC MD ON DIESEL ISSUE: డీజిల్‌ను పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తూ ఆర్టీసీ డిపోలకు సరఫరా చేస్తున్నారంటూ వచ్చిన కథనంపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. కంపెనీలు ఇచ్చే రాయితీ కంటే ఎక్కువకు కొందరు డీలర్లు కోట్ చేసిన మాట వాస్తవమేనన్న ఆయన.. ఈ దందాలో అధికార పార్టీ నాయకుల ప్రమేయం లేదని చెప్పారు. ఎవరు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తే వారి నుంచి డీజిల్ కొనుగోలు చేసి.. సంస్థకు ప్రయోజనం జరిగేలా చూడటమే తమ ఉద్దేశమన్నారు. దీని వల్ల రాష్ట్ర ఆదాయానికి గండి పడకుండా చూడటం తమ బాధ్యత అన్నారు. ఇతర రాష్ట్రాల్లోని బంకుల నుంచి డీజిల్ కొనుగోలు వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై కఠినమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.
2022 మార్చి నుంచి 2025 ఫిబ్రవరి వరకు టెండర్ రూ.5.87 పైసలు లీటరు డిస్కౌంట్ ఇవ్వడంతో 157 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని.. అందుకే ఆ టెండర్ ఖరారు చేసామని పేర్కొన్నారు. బల్క్ రేట్లు పెరగడంతో లోకల్ గానే డీజిల్ ప్రొక్యూర్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరిన ప్రతి జిల్లాలో ఆర్ఎంఓ కమిటీ ఏర్పాటు చేసి లోకల్‌గా రిటైల్ ద్వారా డీజిల్ కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. మార్చి 1 నుంచి బల్క్ ధరలు తగ్గడం వల్ల.. మళ్లీ బల్క్ రేట్ల ద్వారానే డీజిల్ కొనుగోలు చేస్తున్నామన్నారు.
"ఆయిల్ కంపెనీ వాళ్లు వాళ్లకిచ్చే డిస్కౌంట్ కన్న ఎక్కువ డిస్కౌంట్ ఆర్టీసీకి ఇవ్వడానికి కొంతమంది ముందుకు వచ్చారు. ఇది వాస్తవం. ఆర్టీసీకి నష్టం రావొద్దు, రాష్ట్ర ఆదాయానికి గండి పడొద్దు, ఎక్కడా కూడా అవినీతి, అక్రమాలకు అవకాశం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నాం. అయితే కొన్ని మీడియాల్లో తప్పుడు కథనాలు రాస్తున్నారు. డీజిల్ దందా చేస్తున్నారని.. ఇందులో అధికార పార్టీ నాయకులు ప్రమేయం ఉన్నట్లు.. కానీ అందులో వాస్తవం లేదు"-ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ ఎండీ
త్వరలో ఆర్టీసీకి2736 బస్సులు: త్వరలో సుమారు 1500 డీజిల్ బస్సులు, 1000 ఎలక్ట్రిక్ బస్సులు, 200 పాత డీజిల్ బస్సులు, మిగిలిన 36 అద్దె ప్రాతిపదికన తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ ఇన్ని బస్సులు కొనుగోలు చేయడం ఇదే తొలిసారని ఆయన వెల్లడించారు. కర్ణాటకలో కొత్తగా తీసుకువచ్చిన 15 మీటర్ల బస్సులను రాష్ట్రానికి తీసుకురానున్నట్లు తెలిపారు. 2736 మొత్తం బస్సులను త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. 15 ఏళ్లు పూర్తి అయిన 221 బస్సులను గుర్తించామని వెల్లడించారు. కొత్త బస్సులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి 4 నెలల్లో ప్రారంభిస్తామని తెలిపారు. కొత్త బస్సులకు 572 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. ఇప్పటికే ఒడిశా, కర్ణాటక ఆర్టీసీలతో అంతర్రాష్ట్ర ఒప్పందం పూర్తయిందని, త్వరలో తమిళనాడు, తెలంగాణ ఆర్టీసీలతో కూడా ఒప్పందాలు చేసుకొని, ఏ రాష్ట్రంలో ఎన్ని కిలో మీటర్లు మేర తిరగొచ్చు అనేది స్పష్టం అయ్యాక బస్సుల సంఖ్య పెంచుతామని ఎండీ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: