AP High court on APERC: గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) నిబంధనలను, యూనిట్ టారిఫ్(ధర)లను సవరించాలని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, డిస్కంలు... ఏపీఈఆర్‌సీని కోరడం సరికాదని సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థల తరఫున సీనియర్ న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు. ఒప్పందాలు ప్రభుత్వాలతో జరుగుతాయేకాని రాజకీయ పార్టీలతో కాదన్నారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన విధానపరమైన నిర్ణయాలను మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. చట్టబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించిన టెండర్ ప్రక్రియ ద్వారా నిర్వహించిన బిడ్డింగ్ తర్వాతే పీపీఏలు జరిగాయని గుర్తుచేశారు. వాటిని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. యూనిట్ ధరలను సమీక్షించే అధికారం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి(ఈఆర్‌సీ) లేదన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. యూనిట్ ధరలను పునఃసమీక్షించే అధికారం ఈఆర్‌సీకి ఉందన్నారు. మరికొందరి న్యాయవాదుల వాదనల కోసం విచారణను ఫిబ్రవరి మూడో తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టంచేసింది
సింగిల్ జడ్జి తాత్కాలిక చర్యలపై అభ్యంతరం..
గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏ యూనిట్ టారిఫ్‌లను ఏపీ ఈఆర్‌సీ సమీక్షించేందుకు వీలుకల్పిస్తూ 2019లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ధర్మాసనం ముందు అప్పీల్ చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ సంస్థల తరఫున సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్, పి.శ్రీరఘురాం, బసవ ప్రభుపాటిల్, సజన్ పూవయ్య, చల్లా గుణరంజన్ తదితరులు వాదనలు వినిపించారు. హైకోర్టు సింగిల్ జడ్జి తాత్కాలిక చర్యల్లో భాగంగా బకాయిలను సోలార్ యూనిట్‌కు రూ.2.44, పవన విద్యుత్ యూనిట్‌కు రూ.2.43 చొప్పున చెల్లించాలని పేర్కొనడంపై అభ్యంతరం తెలిపారు. ఒకవైపు పీపీఏల విషయంలో ప్రభుత్వ జోక్యం సరికాదంటూనే మరోవైపు తక్కువ ధరలను చెల్లించాలని సింగిల్ జడ్జి పేర్కొనడం సరికాదన్నారు. పీపీఏలో పేర్కొన్న ప్రకారం యూనిట్ ధర రూ.4.84, రూ.4.83 చొప్పున చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పీపీఏలలో ప్రభుత్వ జోక్యాన్ని విద్యుత్ చట్టం నిలువరిస్తుందన్నారు. వినియోగదారులకు విద్యుత్‌ను సబ్సిడీపై సరఫరా చేసినప్పుడు ఆ సొమ్ము మొత్తాన్ని ప్రభుత్వాలే డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ శాఖల నుంచి డిస్కంలకు రూ.25 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. తాము ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను పంపిణీ చేస్తున్న డిస్కంలు... వినియోగదారుల నుంచి రుసుములను వసూలు చేస్తూ తమకు మాత్రం మొండిచేయి చూపిస్తున్నాయని ఆరోపించారు. డిస్కంలు నష్టాల్లో ఉన్నాయనే కారణం చూపుతూ యూనిట్ ధరలను తగ్గించాలని కోరడం సరికాదన్నారు.
ఇదీ చదవండి:ఈ పీఆర్సీ మాకొద్దు.. సమ్మెకు వెనుకాడబోం: ఉద్యోగ సంఘాలు