ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP High Court New judges: ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు - four advocates as andhra pradesh high court judges

AP High Court New judges: హైకోర్టుకు నూతన న్యాయమూర్తులుగా నలుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి పంపింది. త్వరలోనే కేంద్రం ఆమోదం రానుంది. మొత్తం ఏడుగురి పేర్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. సుప్రీంకోర్టుకు పంపగా వాటిలో నలుగురిని కేంద్రానికి సిఫార్సు చేశారు.

AP High Court New judges
AP High Court New judges

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2023, 10:11 AM IST

AP High Court New judges: ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు

AP High Court New judges: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి పోస్టులకు నలుగురు న్యాయవాదులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాల నేతృత్వంలోని కొలీజియం.. న్యాయవాదులు హరినాథ్‌ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్‌ పేర్లను జడ్జిల పోస్టులకు సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పనిచేస్తున్న ఇద్దరు అత్యంత సీనియర్‌ న్యాయమూర్తులతో సంప్రదించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫిబ్రవరి 22న ఈ నలుగురు న్యాయవాదుల పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫార్సు చేశారని కొలీజియం తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వీరి సీనియారిటీని నిర్ణయించనున్నట్లు పేర్కొంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు సీజే నేతృత్వంలోని కొలీజియం న్యాయవాదుల కోటా నుంచి హైకోర్టు జడ్జిలుగా నియమించేందుకు మొత్తం ఏడు పేర్లను సుప్రీంకోర్టుకు సిఫారసు చేసినట్లు తెలిసింది. హరినాథ్‌ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్‌, యర్రంరెడ్డి నాగిరెడ్డి, ఎన్‌.రవిప్రసాద్‌, అశ్వత్థ నారాయణ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ 7 పేర్లలో సుప్రీం కొలీజియం 4 పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది. 37 పోస్టులున్న ఆంధ్రప్రదేశ్​ హైకోర్టులో ప్రస్తుతం 27 మంది న్యాయమూర్తులు సేవలందిస్తుండగా.. 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నలుగురి నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఖాళీల సంఖ్య ఆరుకి తగ్గుతుంది.

Supreme Court Recommended Four Judges to AP High Court: హైకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు.. కొలీజియం ఉత్తర్వులు

Harinath Nunepally: ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాతకోట గ్రామంలో కృష్ణవేణి, బాల వెంకటరెడ్డి దంపతులకు 1972 జనవరి 12న హరినాథ్‌ నూనెపల్లి జన్మించారు. హైదరాబాద్‌లో 1987లో పదో తరగతి చదివారు. ఏలూరు CRR న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. సీనియర్‌ న్యాయవాది ఎస్‌.రవి ఆఫీసులో న్యాయవాద వృత్తిలో మెలకువలు నేర్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2001-04 మధ్య అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, సీనియర్‌ ప్యానల్‌ కౌన్సిల్‌గా, ఈడీ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. 2012లో ఏపీ బార్‌ కౌన్సిల్‌గా ఎన్నికయ్యారు. 2015లో ఎన్‌ఐఏ ప్రత్యేక పీపీగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌గా సేవలు అందిస్తున్నారు.

Kiranmayee Mandava: కిరణ్మయి మండవ..1970 జులై 30న జన్మించారు. స్వగ్రామం ఉమ్మడి కృష్ణా జిల్లా కూచిపూడి. మొవ్వ మండలం బార్లపూడి గ్రామంలో ప్రాథమిక విద్య, కూచిపూడిలో హైస్కూల్‌ విద్యను పూర్తి చేసి.. సికింద్రాబాద్‌లోని వెస్లీ మహిళా కళాశాలలో ఇంటర్‌, ఉస్మానియా యూనివర్సిటీ న్యాయకళాశాలలో లా చదివారు. 1994 డిసెంబరు 28వ తేదీన బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. న్యాయవాది జేవీ ప్రసాద్‌ వద్ద జూనియర్‌గా చేరి తన వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 2003వ సంవత్సరంలో ఆదాయ పన్ను శాఖ తరఫున హైకోర్టులో జూనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, తర్వాత సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 14 ఏళ్లపాటు ఆదాయ పన్నుశాఖ తరఫున స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలందించారు.

Judges Were Transferred and Postings by AP High Court : కడప పీడీజేగా శ్రీదేవి నియామకం..పలువురు జడ్జిలు బదిలీ.. పోస్టింగులు

Sumathi Jagadam: సుమతి జగడం 1971 జూన్‌ 28న జన్మించారు. స్వస్థలం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలంలోని పండువారిపేట గ్రామం. హైదరాబాద్‌లోని హోలీ మేరీ బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ మహిళా కళాశాలలో బీఏ చదివారు. అదే వర్సిటీ పరిధిలోని ఆంధ్ర మహిళా సభ మహిళా న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1998 మార్చి 19న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. సీనియర్‌ న్యాయవాది బొజ్జా తారకం ఆఫీసులో జూనియర్‌గా చేరి మెలకువలు నేర్చుకున్నారు. 2004-09 వరకు హైకోర్టులో సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. గ్రామపంచాయతీ, జడ్పీ, ఎంపీపీలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలు అందించారు. 2020 జూన్‌ నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేస్తున్నారు.

Nyapathy Vijay: న్యాపతి విజయ్‌ 1974 ఆగస్టు 8న రాజమహేంద్రవరంలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1997లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1998లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలను అందిస్తున్న జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు వద్ద న్యాయవాదిగా చేరి వృత్తిలో మెలకువలు నేర్చుకున్నారు. 2012 నుంచి స్వతంత్ర ప్రాక్టీసు మొదలుపెట్టారు. సివిల్‌, క్రిమినల్‌, ట్యాక్స్‌, రెవెన్యూ, తదితర సబ్జెక్టుల్లో మంచి పట్టు సాధించారు. హైకోర్టు, కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్లో పలు కేసులలో తన వాదనలు వినిపించారు. క్రికెట్‌పై మక్కువతో న్యాయవాదుల తరఫున వివిధ టోర్నమెంట్లలో పాల్గొన్నారు.

High Court on Social Media Trolls on Judges: క్రిమినల్‌ కోర్టుధిక్కరణపై ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన హైకోర్టు..

ABOUT THE AUTHOR

...view details