గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీని ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఏపీడీడీసీ) పరిధిలోకి ప్రభుత్వం తిరిగి తీసుకుంది. డెయిరీ నిర్వహణ బాధ్యతను తెనాలి సబ్‌కలెక్టర్ మయూర్ అశోక్‌కు అప్పగించింది. డెయిరీ నిర్వహణ బాధ్యతను గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి అప్పగిస్తూ... 1978 జులై 17న ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. నిత్యావసరాల సరఫరా, డెయిరీ ఆస్తుల రక్షణకు 3 నెలల కాలానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
‘సంగం జాగర్లమూడిలోని డెయిరీ కార్యకలాపాల బాధ్యతల్ని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం లిమిటెడ్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం 1978 జులై 17న ఉత్తర్వులు(జీవో 515) జారీ చేసింది. భూములు, డెయిరీ ప్లాంట్, యంత్రాలపై యాజమాన్య హక్కుల్ని బదిలీ చేయలేదు. ప్రభుత్వ అనుమతి లేకుండా వాటిని తాకట్టు పెట్టడం, ఇతరులకు స్వాధీనం చేయకూడదు. నిర్వహణ కోసం అప్పగించిన డెయిరీలో అవకతవకలు, ఆస్తుల దుర్వినియోగం జరిగిందని.. 2020 సెప్టెంబరు 11న పాల కమిషనర్, మిల్క్ కోఆపరేటివ్స్ రిజిస్ట్రార్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. దీనిపై విచారించాలని 2020 నవంబరు 5న అవినీతి నిరోధక శాఖ(అనిశా)ను సర్కారు కోరింది’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
యాజమాన్య హక్కులు ఏపీడీడీసీవే
‘డెయిరీలో అవకతవకలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొంటూ 2021 ఏప్రిల్ 19న అనిశా తన విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఎండీ, అప్పటి సహకార అధికారితో కలిసి గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సంఘం ఛైర్మన్.. డెయిరీకి చెందిన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని తన తండ్రి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ట్రస్ట్ పేరిట బదలాయించారని నివేదిక వివరించింది. డెయిరీని పాల ఉత్పత్తిదారుల సంస్థగా మార్చడంతోపాటు ప్రభుత్వ/ఏపీడీడీసీ భూములను తనఖా పెట్టి ఎన్‌డీడీబీ నుంచి మోసపూరితంగా భారీ రుణాలు పొందారని అనిశా నివేదిక వివరించింది. డెయిరీ నిర్వహణ మాత్రమే పాల ఉత్పత్తిదారుల సంఘానికి బదిలీ చేశారని.. యాజమాన్య హక్కులు ఎప్పుడూ ఏపీడీడీసీ దగ్గరే ఉన్నాయని పేర్కొంది. వీటన్నింటిపై అనిశా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది’ అని ప్రభుత్వ ఉత్తర్వు వివరించింది. ఉల్లంఘనలపై అనిశా నివేదిక మేరకు.. ప్రజా ప్రయోజనం దృష్ట్యా జీవో 515ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.