AP Government Increased Estimated Cost of Projects: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో వెచ్చించిన మొత్తం కన్నా, పెరిగిన అంచనాల విలువ ఎక్కువ కావడం గమనార్హం. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 30,323.89 కోట్ల మేర అంచనాలను ప్రభుత్వం పెంచేసింది. ప్రాధాన్య ప్రాజెక్టులన్నింటినీ వేగంగా పూర్తి చేస్తామని నాడు జగన్ చెప్పిన మాటలకు, నేటి చేతలకు పొంతన లేదు. ఎక్కడా అవసరాల మేర నిధులు కేటాయించడం లేదు. కేటాయించిన వాటిలోనూ సగమైనా వెచ్చించడం లేదు.
పనులు చేసిన గుత్తేదారులకు సకాలంలో బిల్లులు ఇవ్వడం లేదు. అనేక మంది గుత్తేదారులు పనులు అర్ధాంతరంగా వదిలేసి వెళ్లిపోయారు. అప్పటికే పురోగతిలో ఉన్న కొన్ని ప్రాజెక్టుల పనులను నిలిపివేయించిన ప్రభుత్వం.. మరోపక్క చేపట్టాల్సిన వాటి అంచనాలను సైతం భారీగా పెంచేసింది. వీటిలో కొన్నింటికి టెండర్లు పిలిచి అస్మదీయులకు అప్పగించేసింది. కొన్నిచోట్ల రద్దు చేసిన ప్యాకేజీలను తిరిగి ప్రారంభించలేదు. నిర్మాణాలో జాప్యం.. అంచనాల పెంపు.. నిధులు వెచ్చించకపోవడం.. వెరసి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ రంగం ఒక ప్రహసనంలా మారింది.
Rayalaseema Farmers Waiting For HNSS Water: హంద్రీనీవాకు పారని సాగునీరు.. రైతు కంట పారుతున్న కన్నీరు
No Development in Irrigation Projects in AP: శ్రీశైలం వరద జలాలను ఉమ్మడి కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు అందించే గాలేరు నగరి సుజల స్రవంతి పథకం అంచనాలు వైసీపీ హయాంలో భారీగా పెరిగిపోయాయి. 2019 జూన్‌తో పోలిస్తే 2,366.72 కోట్ల అంచనాలు పెంచేశారు. ఈ ప్రాజెక్టు సాకారమైతే రాయలసీమలో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాలకు తాగునీటి వసతి లభిస్తుంది. రెండో దశలోని కొన్ని ప్యాకేజీల పనులను ఇప్పటికే రద్దు చేశారు. ఆ ప్యాకేజీలో మిగిలిన పని విలువను తాజాగా లెక్కించి మళ్లీ టెండర్లు పిలిచేందుకు జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారు. ఈ లెక్కలు కూడా తేలితే ప్రాజెక్టు అంచనాలు ఇంకా పెరగనున్నాయి.
హంద్రీ నీవా తొలి రెండు దశలకు సంబంధించి 1,144.20 కోట్ల మేర అంచనాలు పెరిగిపోయాయి. రాయలసీమ జిల్లాల్లో 6,383 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 33 లక్షల జనాభాకు తాగునీరు అందించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. గతంలోనే తొలిదశ పనులు పూర్తికాగా, ఇంతవరకు డిస్ట్రిబ్యూటరీలు నిర్మించలేదు. రెండో దశలో ఇప్పటికే వైసీపీ సర్కారు కొన్ని ప్యాకేజీల పనులు రద్దుచేసింది. మిగిలిన వాటి విలువను తాజాగా లెక్కించి మళ్లీ టెండర్లు పిలిచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
ఉత్తరాంధ్రలో కీలకమైన బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు రెండో దశ రెండో భాగం పనులకు ప్రభుత్వం సరిపడా నిధులివ్వడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో 9 మండలాల్లోని 225 గ్రామాల్లో తాగునీరు, వ్యవసాయ అవసరాలను తీర్చే ప్రాజెక్టు ఇది. దీనికి 1,008.27 కోట్ల మేర అంచనాలు ఇప్పటికే పెంచగా, పునరావాస కల్పనకు మరో 216.71 కోట్లు పెంచబోతున్నారు. ఈ ప్రాజెక్టుపై మొత్తంగా 1,224.78 కోట్ల వరకు అంచనాలు పెంచినట్లవుతుంది.