కారు ఆశ చూపించి 55 వేల నగదును అపహరించిన ఘటన గుంటూరులో జరిగింది. శ్రీనగర్‌లో నివాసం ఉంటున్న రఘు ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. 20 వేల జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో..ఒక కారు కొనుగోలు చేయాలనుకున్నాడు. ఇందుకోసం ఆన్లైన్లో వెతికాడు. ఓఎల్ఎక్స్లో కారులను పరిశీలించి ఓ వ్యక్తిని సంప్రదించాడు. తనకు నచ్చిన మోడల్ కారు 3 లక్షల 70 వేలకు బేరం కుదుర్చుకుని.. వెంటనే 5 వేల రూపాయలు పవన్ కుమార్ అనే వ్యక్తికి అడ్వాన్స్ ఇచ్చాడు. మరుసటి రోజు 50 వేల నగదు అకౌంట్ ద్వారా చెల్లించాడు. మంచిరోజు చూసి కారు ఇంటికి తెచ్చుకొందాం అనుకున్నాడు. కానీ... కథ అక్కడే అడ్డం తిరిగింది.
ఎంతో ఆతృతతో కారు తెచ్చుకుందామనుకున్న రఘుకు నిరాశే ఎదురైంది. డబ్బులు తీసుకున్న తర్వాత పవన్‌కుమార్ అడ్రస్ లేకుండాపోయాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా... స్విచ్ ఆఫ్ అనే సమాధానం వచ్చిందని బాధితుడు రఘు వాపోయాడు. కారు ఉన్న ప్రదేశానికి వెళ్లి అడిగితే... ఆ కారు పవన్‌కుమార్‌ది కాదని బయటపడింది. దీంతో తాను మోసపోయామని గ్రహించిన బాధితుడు పోలీసులును ఆశ్రయించాడు. తనకు తగిన న్యాయం చేయాలని గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.