CM Review Health Department: ఫిబ్రవరి చివరినాటికి గిరిజన ప్రాంతాలు సహా అన్నిఆసుపత్రుల్లోని ఖాళీలను భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం... నాడు-నేడు, వైయస్సార్ విలేజ్ క్లినిక్స్, అర్బన్ క్లినిక్స్ నిర్మాణ ప్రగతిపై ఆరాతీశారు. వైద్య సేవల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించడంపై దృష్టిపెట్టాలని... ఇప్పుడు ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీచేయాలని సీఎం ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లు అక్కడ ఉండి సేవలను అందించడానికి ఎలాంటి ప్రతిపాదన చేసినా ఆమోదిస్తానని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సేవలందించే డాక్టర్లకు ప్రోత్సాహకాలు ఎంత ఇవ్వాలన్నదానిపై అధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకుంటే... దాన్ని తప్పనిసరిగా ఆమోదిస్తానన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా ఉండాలన్న సీఎం... డాక్టర్లు లేరు, సిబ్బంది లేరనే మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పష్టంగా మార్పులు కనిపించాలన్నారు.
కొవిడ్ నియంత్రణపై సమీక్ష...