AP CEO Mukesh Kumar Meena: ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన సమాచారం ప్రతివారం రాజకీయ పార్టీలకు నియోజకవర్గస్థాయిలో అందిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. లోపాలులేని ఓటర్ల జాబితా కోసం రాజకీయపక్షాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటింటి ధ్రువీకరణపై అఖిలపక్ష భేటీ నిర్వహించిన ఎన్నికల ప్రధానాధికారి ..EROలు ప్రతివారం క్లెయిమ్‌లు, అభ్యంతరాల జాబితా నియోజకవర్గ స్థాయిలో పార్టీలకు అందిస్తాయని, ఆ వివరాలనే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు.. CEO తెలిపారు. జులై 21 నుంచి ఇంటింటి ధ్రువీకరణ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపిన ఆయన.. సర్వేలో భాగంగా BLOయాప్ ద్వారా సమాచారాన్ని అప్‌డేట్ చేస్తామన్నారు. బూత్ స్థాయి ఏజెంట్లు BLOలతో కలిసి వెళ్లొచ్చన్నారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల జోక్యంపై మార్గదర్శకాలు విడుదల చేసినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్ తెలిపారు.
ఓటర్ల పరిశీలనకు వాలంటీర్లను రానివ్వద్దు: రాష్ట్రంలో నేటి(జులై 21) నుంచి నెల రోజులపాటు జరగనున్న ఓటర్ల ఇంటింటి పరిశీలనకు వాలంటీర్లు, సచివాలయాల్లోని మహిళా సంక్షేమ కార్యదర్శుల్ని దూరంగా ఉంచాలని తెలుగుదేశం పార్టీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరాయి. పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్చడం, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లు తొలగించడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ఆరోపించాయి. ఇంటింటి పరిశీలనలో భాగంగా బూత్‌స్థాయి అధికారులు దొంగ ఓట్ల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని కోరాయి.