ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చైల్డ్‌ఇన్‌ఫోలో విద్యార్థుల వివరాలు నమోదు

ఉపాధ్యాయుల బదిలీలతోపాటు హేతుబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను నియమించకపోతే సమస్యలు నెలకొంటాయని ఆయాసంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో తాజాగా నిబంధనల్లో మార్పులు చేస్తూ చైల్డ్‌ఇన్‌ఫోలో విద్యార్థుల వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయడానికి అవకాశం కల్పించింది. దీంతో అధికారులు ఆయా వివరాలు సేకరించడంలో నిమగ్నమయ్యారు.

private schools not giving tc to children
ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ

By

Published : Oct 30, 2020, 6:39 PM IST

హేతుబద్దీకరణలో భాగంగా ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి ఆయా పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను కేటాయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో పెక్కుసంఖ్యలో విద్యార్థులు చేరడంతో నవంబరు 2 వరకు చేరిన విద్యార్థులను ప్రామాణికంగా తీసుకునేలా ప్రభుత్వం తాజాగా మార్పులు చేసింది. దీనికి అనుగుణంగా జిల్లావిద్యాశాఖ ఆయా పాఠశాలల్లో చేరిన విద్యార్థులందరి వివరాలను చైల్డ్‌ఇన్‌ఫోలో నమోదు చేయాలని ఎమ్యీవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఒక విద్యార్థి పాఠశాలలో కొత్తగా చేరినా, లేదా ఒక పాఠశాలనుంచి మరోదానికి మారినా వారి డేటాను కూడా నమోదు చేయాల్సిన బాధ్యత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎమ్యీవోలదేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపు విద్యార్థుల వివరాలన్నింటినీ నమోదు చేయాల్సి ఉంది.

టీసీ లేకున్నా ఇబ్బంది లేదు

ప్రయివేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు యాజమాన్యాలు టీసీలు ఇవ్వకపోవడంతో చైల్డ్‌ఇన్‌ఫోలో నమోదు చేయలేక పోతున్నామని ఉపాధ్యాయులు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో టీసీ లేని విద్యార్థుల నుంచి తల్లిదండ్రుల అంగీకారపత్రంతో నమోదు చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. తల్లిదండ్రుల అంగీకారం తీసుకునేందుకు ప్రత్యేక పత్రాన్ని రూపొందించి ఉపాధ్యాయులకు అందజేశారు. ఉపాధ్యాయులు ఆ అంగీకార పత్రాలను మండల విద్యాశాఖ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఎమ్యీవోలు అందరూ తమ మండల పరిధిలో తల్లిదండ్రుల డిక్లరేషన్‌తో చేరిన విద్యార్థుల వివరాలను చైల్డ్‌ఇన్‌ఫో సైట్‌లోని డ్రాప్‌బాక్సులో పెట్టాలని సూచించారు. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులందరి వివరాలను చైల్‌ఇన్‌ఫోలో నమోదుచేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత హేతుబద్ధీకరణ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

ఆదేశాలు జారీ

తాజా ఉత్తర్వుల ప్రకారంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులందరి వివరాలను చైల్డ్‌ఇన్‌ఫోలో నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. డీఈవో ఆదేశాలమేరకు ఉపాధ్యాయులందరికీ ఉత్తర్వులు జారీ చేశాం. విద్యార్థుల వివరాలను నమోదు చేసే బాధ్యత, హెచ్‌ఎంలు, ఎమ్​ఈవోలదే.తల్లిదండ్రులు కూడా టీసీలు ఇవ్వడం లేదని ఆందోళన చెందకుండా పాఠశాల ఉపాధ్యాయులకు అంగీకారపత్రాలు అందజేయాలని కోరుతున్నాం. - యూవీ సుబ్బారావు, డీవైఈవో, మచిలీపట్నం

ఇదీ చదవండి :

పూర్వ ప్రాథమిక విద్యకు పాఠ్యాంశాలు సిద్ధం

ABOUT THE AUTHOR

...view details