Annamayya Worship Festival : 'వీధుల వీధుల విభుడేగే' అనే అన్నమయ్య కృతిలో ఉన్నట్టు కెనడా వ్యాప్తంగా ఆరు ప్రావిన్స్‌ల నుండి 108 విలక్షణమైన అన్నమయ్య కృతులతో 11 గంటల పాటు అన్నమయ్య ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగుతల్లి కెనడా లక్ష్మి రాయవరపు వారి బృందం ఆధ్వర్యంలో ప్రఖ్యాత తెలుగు సినిమా కథ, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, యస్పి వసంత లక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఉమా సలాది దీప ప్రజ్వలన చేయగా పాణంగిపల్లి విజయలక్ష్మి ప్రార్థన గీతంతో సభ మొదలైంది. అశోక్ తేజ మాట్లాడుతూ జీవితంలో ప్రతి సందర్భంలోనూ అతి చిన్న పదాలతో జనాలు నాల్కల మీద తిరిగే రచనలు వ్రాసిన అన్నమయ్య.. తన వంటి ఎందరో రచయితలకు మార్గ దర్శకులు అయ్యారని, అన్నమయ్య పుట్టిన తిథిలోనే తాను కూడా పుట్టారని తెలియజేస్తూ, అన్నమయ్య గురించి చేసిన ప్రసంగంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహణ ద్వారా తెలుగుతల్లి కెనడా భావితరాలకు మంచి సంస్కృతి, సంస్కారాన్ని అందిస్తుందని వారు అన్నారు.
తెలుగుతల్లి కెనడా వెబ్ మాసపత్రికతో పాటు ప్రతినెలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వలన దేశంలో ఉన్న ప్రతిభావంతులైన వారందరినీ ఒకేచోట చేర్చడం తన లక్ష్యమని తెలుగుతల్లి కెనడా వ్యవస్థాపకులు లక్ష్మి రాయవరపు తెలియజేశారు. మన తెలుగు భాషలో ఎన్నో గొప్ప భక్తి గీతాలు ఉన్నాయని, అన్నమయ్యకు పదకవితా పితామహుడనే బిరుదు ఉందని, అన్నమయ్య పాటలు, పదాలు, సాహిత్యం, పద్యాలలో భక్తి, పెనవేసుకొని ఉంటాయని తెలిపారు. తెలుగు భాషకు అత్యున్నత వైభవం అన్నమయ్య కృతులు దేశ విదేశాలకు పరిచయం చేయాలనేది తన సంకల్పమని లక్ష్మి అన్నారు.