సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదు - 25వ రోజుకు చేరిన అంగన్వాడీల ఆందోళన Anganwadi Workers Protest: అంగన్వాడీలపై ప్రభుత్వం అధిక పనిభారం మోపుతోందని కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. విజయవాడలో అంగన్వాడీల 24 గంటల రిలే దీక్షా శిబిరాన్ని ఆలిండియా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సింధు సందర్శించి సంఘీభావం తెలిపారు.
తమ న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని గత 25 రోజులుగా అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించడంలో, గ్రాడ్యుటీ సౌకర్యం కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. అనేక యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీలపై పని ఒత్తిడి పెంచారన్నారు.
బెదిరింపులకు పాల్పడినా సమ్మె విరమించం - స్పష్టం చేసిన అంగన్వాడీలు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీవో కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. చెవులుండి వినలేని, కళ్లుండి చూడలేని, నోరుండి మాట్లాడలేని సీఎం మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రాట్యూటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైలవరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద వృత్తాకారంలో కూర్చుని నినాదాలు చేశారు. గుంటూరులో ఆందోళనలకు పలువురు ప్రజాసంఘాల నేతలు మద్దతు తెలిపారు. ఈనెల 9వ తేదీ నుంచి రిలే నిరాహారదీక్షలు చేపడుతున్నట్లు అంగన్వాడీల సంఘం నాయకురాలు దీప్తి తెలిపారు. ప్రభుత్వం వెంటనే వేతనాలు పెంచటంతో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలని, లేకపోతే సమ్మె తీవ్రం చెస్తామని హెచ్ఛరించారు. బాపట్ల జిల్లా కారంచేడులో అంగన్వాడీలు దున్నపోతుకు వినతిపత్రం అందించి నిరసన తెలిపారు.
సమ్మెను ఉద్ధృతం చేస్తున్న అంగన్వాడీలు - అడ్డుకుంటున్న పోలీసులు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కోలాటం ఆడి పాటలు పాడి నిరసన తెలిపారు. ఉరవకొండలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీక్షలకు వామపక్ష నేతలు మద్దతు తెలిపారు. గత 25 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసనలు, అందోళనలు చేస్తుంటే ప్రభుత్వానికి ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని విమర్శించారు. పుట్టపర్తిలో గంగిరెద్దుకు వినతిపత్రం అందించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం అంగన్వాడీలకు జారీ చేసిన నోటీసులను దహనం చేశారు.
సమస్యలు పరిష్కరించే వరకూ విధులకు హాజరుకాబోమని ఒంగోలులో అంగన్‌వాడీలు స్పష్టం చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 25 అంకె ఆకారంలో కూర్చుని ఆందోళన చేశారు. కాకినాడ జిల్లా తునిలో అంగన్వాడీలు సోది చెబుతూ నిరసన తెలిపారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద 25 సంఖ్య ఆకృతిలో కూర్చుని దండం పెడుతూ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. బొబ్బిలిలో అంగన్వాడీల ఆందోళనలకు తెలుగుదేశం నేత సుజయ కృష్ణ మద్దతు తెలిపారు.
సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తాం - ప్రభుత్వ నోటీసులపై అంగన్వాడీల ధ్వజం