Amaravati Padayatra: ఆరంభం నుంచీ అడ్డంకులు, ఆంక్షలను ఎదుర్కొంటూ వస్తున్న రాజధాని రైతుల అమరావతి నుంచి అరసవల్లి మహాపాదయాత్రకు ప్రకటించిన తాత్కాలిక విరామం.. మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. 41వ రోజున రామచంద్రాపురంలో పాదయాత్ర ప్రారంభానికి ముందు పోలీసులు.. రైతులు బస చేస్తున్న కల్యాణ మండపాన్ని చుట్టుముట్టారు. అంతకు ముందు రోజున పసలపూడిలో.. పోలీసులు అడ్డగించడం వల్ల జరిగిన తోపులాటలో పలువురు మహిళా రైతులు గాయపడ్డారు. పాదయాత్రకు వస్తున్న మద్దతు చూసి ఓర్వలేకనే.. ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తున్న రైతులు.. అందుకు అనుగుణంగా న్యాయస్థానం నుంచి మరోసారి స్పష్టత తెచ్చుకోవాలని యోచిస్తున్నారు.
వరుస సెలవుల అనంతరం.. 27వ తేదీన హైకోర్టు తిరిగి ప్రారంభం కానందున.. అదే రోజు పిటిషన్ వేయాలని ఐకాస భావిస్తోంది. రాజధానికి భూములిచ్చి రోడ్డున పడ్డ తాము.. అన్ని ప్రాంతాల ప్రజల మద్దతు కూడగట్టేందుకే.. పాదయాత్ర చేస్తున్నామని గుర్తుచేస్తున్నారు. ప్రజలు సంఘీభావం తెలపడానికి వీల్లేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించిన రైతులు.. ఇక తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. అమరావతికి ప్రజామద్దతు కోసమే పాదయాత్రలో ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు తిరిగేలా రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకున్నామని స్పష్టం చేస్తున్నారు.