Amaravati-Vijayawada Main Roads: అమరావతి- విజయవాడ మధ్య ప్రధాన రహదారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రధానంగా అమరావతి నుంచి తుళ్లూరు మధ్య 18 కిలోమీటర్ల మేరకు రహదారి దారుణంగా దెబ్బతింది. కొన్ని చోట్ల రహదారి నిలువునా చీలిపోయింది. రహదారిపై తారు లేచిపోయి.. కంకర రాళ్లు పైకి తేలి ప్రమాదకరంగా మారింది. అమరావతి నుంచి పెదమద్దూరు వరకు రహదారి పలుచోట్ల కుంగిపోయింది. గుంతల నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు పడరాని పాట్లు పడుతున్నారు. పలువురు వాహనదార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. కనీసం ఈ రహదారిపై పాదచారులు సైతం నడవలేని దయనీయ పరిస్థితి నెలకొంది.
"రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. అమరావతి, పెద్దమద్దూరు, వడ్లమాను రోడ్లన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి. ద్విచక్రవాహనదారులు, బస్సులు, ఆటోలు ఇలా ఏవైనా సరే ఈ రోడ్లపై ప్రయాణించలేక అదుపుతప్పి కింద పడిపోతున్నారు. మధ్యాహ్నం తప్పితే రాత్రి పూట ఈ రోడ్లపై పోలేని పరిస్థితి నెలకొంది"-స్థానికులు
అమరావతి-విజయవాడ రోడ్డులో పెదమద్దూరు వద్ద వంతెన శిథిలావస్థకు చేరింది. రక్షణ గోడలు దెబ్బతినడంతో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వంతెన నుంచి వెళ్లే అప్రోచ్ రోడ్డు దెబ్బతినడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పగలు ఓ మాదిరిగా నెట్టుకురావచ్చని.. అదే రాత్రి పూటైతే వాహనాలు కిందపడక తప్పదని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇక వర్షం పడితే రహదారిపై ప్రయాణించడం కష్టమని చెబుతున్నారు.