గుంటూరు జిల్లా తెనాలి డివిజన్లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కాకుమాను మండలంలో 12 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లను చకచకా చేస్తున్నారు. ఇప్పటికే 118 పోలింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు నిర్మించారు. విద్యుత్తు బల్బులు అమర్చారు. పీవోలకు ఇచ్చే ఎన్నికల సామగ్రిని సిద్ధం చేశారు. స్టేజి 2 అధికారులకు ఇప్పటికే సామగ్రిని అందజేశారు. సోమవారం ఎన్నికల అధికారులకు సామగ్రిని, బ్యాలెట్ బాక్సులు, అట్టలు వస్తువులను అందించే ఏర్పాట్లు చేశారు. తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ హీరాలాల్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయించారు.
గురజాల నియోజకవర్గం రెండో రోజు నామినేషన్ ప్రక్రియ మొదలు మందకొడిగా సాగినా మధ్యాహ్నం నుంచి సజావుగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఒకటి రెండు చోట్ల చిన్నపాటి ఆటంకాలు ఏర్పడినా కానీ ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సమక్షంలో ప్రక్రియ పూర్తయింది.