మాజీ సభాపతి కోడెల కుమార్తెపై ఫిర్యాదు
తెదేపా నేత కోడెల శివప్రసాద్ కుమార్తెపై తెలంగాణకు చెందిన ఓ వ్యాపారి నరసరావుపేట రెండో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రశ్నించగా విజయలక్ష్మి అనుచరులతో దాడి చేయించారని ఆయన ఆరోపించారు.
మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మిపై గుంటూరు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్స్టేషన్లో చల్లా రవీంద్రా రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వెంకటేశ్వర సర్జికల్ కాటన్ మ్యానుఫ్యాక్చరర్స్ పేరుతో రవీంద్రా రెడ్డి వ్యాపారం నిర్వహిస్తున్నారు. తన సంస్థ నుంచి ముప్పాళ్ల మండలం గొల్లపాడులో కోడెల కుమార్తె నిర్వహిస్తున్న సేఫ్ డ్రగ్ హౌస్కు కాటన్ బండిల్స్ నాలుగు సంవత్సరాలుగా సరఫరా చేసినట్లు తెలిపారు. వాటికి సంబంధించి సుమారు 14 లక్షల 58 వేల 650 రూపాయలు కోడెల కుమార్తెకు చెందిన సంస్థ బకాయి పడినట్లు తెలిపారు. 11 నెలలుగా వీటిని చెల్లించలేదని చెప్పారు. తమ మార్కెటింగ్ మేనేజర్ పోతురాజు, వాసుదేవరావు, శ్రీనివాసరావులతో కలిసి నరసరావుపేటలోని కోడెల నివాసంలో బకాయి గురించి విజయలక్ష్మిని కలిశామని రవీంద్ర వెల్లడించారు. డబ్బు చెల్లించాలని కోరగా అనుచరులతో తనపై విజయలక్ష్మి దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు.