couple died in Bhupalappalli: భర్తతో పాటే భార్య జీవితం ముడిపడి ఉంటుంది. కష్టాల్లోను, సుఖాల్లోను భర్తకు తోడు ఉండేది భార్య మాత్రమే. అలానే ఓ భార్య చావులో కూడా తోడు వెళ్లింది. భర్త చనిపోవడం భరించలేక భార్య కూడా మృతి చెందిన ఘటన తెలంగాణ జయశంకర్ భూపాలపల్లిలో జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలానికి మోరంచపల్లి గ్రామానికి చెందిన చుక్క సారయ్య(55)కు ఇద్దరు భార్యలు. అతనికి మెుదటి భార్యకి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వీరందరికి వివాహమైంది. పెద్ద కుమారుడు కొన్ని సంవత్సరాల క్రితమే మృతి చెందాడు.
కొన్ని రోజులు గడిచిన తరవాత సారయ్య, కవిత(50)ను రెండో వివాహం చేసుకున్నాడు. అతను రెండో వివాహం చేసుకోవడం వలన మెుదటి భార్యతో నిత్యం గొడవలు అవుతుండేవి. దీంతో మెుదటి భార్య, పిల్లలు వారిని వదిలేసి వెళ్లిపోయారు. చివరికి అతడు, తన రెండో భార్యతో కలిసి మోరంచపల్లిలో నివాసం ఉన్నారు. అయితే అర్ధరాత్రి సారయ్య గుండెపోటుతో మరణించాడు.
ఈ విషయం తట్టుకోలేని కవిత అతడి మృతి దేహం పక్కనే తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారిన ఎంతకూ ఇంటి తలుపులు తీయకపోవడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా.. దంపతులిద్దరూ విగతజీవులుగా కనిపించారు. మృతదేహాలను చూస్తూ బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.