Several People Died In Road Accidents: ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని కలిదిండి మండలం కొండంగి గ్రామానికి చెందిన పలువురు చేపల వేట కోసం ముదినేపల్లి మండలం సింగరాయపాలెంకు బొలెరో వాహనంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో కోరుకొల్లు వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పిస్తున్న బొలెరో వాహనాన్ని మరో లారీ వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో పక్కనే ఉన్న పంట పొలాల్లోకి బొలెరో వాహనం పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న లక్ష్మీ(40) అనే మహిళ అక్కడకక్కడే మృతి చెందగా.. ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
జాతీయ రహదారిపై పల్టీలు కొట్టిన కారు.. విద్యార్థి మృతి.. నలుగురికి గాయాలు..
కోనసీమ జిల్లా ముమ్మిడివరం కొమానిపల్లె వద్ద జాతీయ రహదారిపై వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఓ కారు యాక్సిడెంట్ జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందగా.. నలుగురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాకినాడలోని ఆస్పత్రికి తరలించారు. వీరిని నరసాపురం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..
డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొమానపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నరసాపురంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్లో చదువుతున్న ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు కాకినాడ జిల్లాలో ఉప్పాడ సముద్ర తీరానికి విహారయాత్రగా కారులో వచ్చారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై కొమానపల్లి వద్ద మలుపులో రోడ్డు మార్జిన్ దాటి పల్టీలు కొడుతూ.. పోయింది. ఈ ప్రమాదంలో నిఖిత అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా.. డేనియల్, శిరీష అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి అమలాపురంలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కాకినాడ ఆస్పత్రికి తరలించారు.
కారు నడుపుతున్న సూర్య సాయి, మరో విద్యార్థిని మమతకు స్వల్ప గాయాలు కావడంతో ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులు.. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో పోలీసులకు సహకరించారు. ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారి మలుపును సరిగా అంచనా వేయకుండా వాహనాన్ని వేగంగా డ్రైవింగ్ చేయటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు అంచనాకొచ్చారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరు విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
భార్యను కొట్టి చంపి.. అనంతరం భర్త ఆత్మహత్య..
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఎగువ రామగిరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యను కర్రలు, రాళ్లతో కొట్టి హత్య చేశాడు. అనంతరం అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఎగువ రామగిరి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు వ్యవసాయం చేయగా భార్య రాధమ్మ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పని చేసేది. కుటుంబ కలహాలతో తరచుగా వీరిద్దరూ గొడవపడుతుండేవారు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు మంగళవారం భార్యకు మాయమాటలు చెప్పి గ్రామ శివారుకు తీసుకుని వెళ్లి.. ముందుగా తెచ్చుకున్న కర్రలతోపాటు రాళ్లతో ముఖంపై కొట్టి హత్య చేశాడు. అనంతరం అతడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని రాధమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి ఒక కుమార్తె ఉంది. విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు ఘటనా స్థలానికి పరుగులు తీశారు. మృతదేహాల వద్ద వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.