Protest at akkireddygudem: ఏలూరు జిల్లాలోని అక్కిరెడ్డిగూడెం గ్రామ శివారులో.. పోరస్ పరిశ్రమ సిబ్బంది, స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన పోరస్ పరిశ్రమలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారంతా.. పరిశ్రమ ముందు బైఠాయించారు. రోడ్డుకు అడ్డంగా ముళ్లకంపలు వేసి రాకపోకలను అడ్డుకున్నారు.
గ్రామంలో గాలి, నీరు కలుషితమవుతోందని, పరిశ్రమ నుంచి దుర్వాసన వస్తోందని గ్రామస్థుల ఆరోపించారు. రసాయన పరిశ్రమ వల్ల పంటలు కూడా సరిగా పండటం లేదని వాపోయారు. గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని తెలిపారు. గ్రామం నుంచి కంపెనీని తరలించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ప్రమాదస్థలిని నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు పరిశీలించారు. అనంతరం గ్రామస్థులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొనటంతో.. పోలీసులు బందోబస్తు చేపట్టారు.