No Medical Facility For Polavaram Evacuees: పోలవరం మండలానికి చెందిన దాదాపు 15 వందల కుటుంబాలు ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండలం తాడువాయిలో నివాసం ఉంటున్నాయి. జీలుగుమిల్లి మండలంలోనూ దాదాపు 15 కాలనీల్లో నిర్వాసితులు ఉంటున్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పునరావస కాలనీలకు తరలించే సమయానికి ఆసుపత్రితో పాటు బడి, గుడి, శ్మశానం, అంగన్వాడీ వంటి 31 రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి.
బిల్లులు చెల్లించక పునాది దశలోనే నిలిచిన ఆసుపత్రి: మిగిలిన సదుపాయాల మాట అటు ఉంచితే.. ఏ కాలనీలోనూ ఇప్పటివరకు ఆసుపత్రి ఏర్పాటు చేయలేదు. 6 కోట్ల 50 లక్షల రూపాయలతో మంజూరు చేసిన.. వేలేరుపాడు మండలంలోని 30 పడకల ఆసుపత్రి ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో పునాది దశలోనే నిలిచిపోయింది. పోలవరం బ్లాక్ కు చెందిన ఆసుపత్రికి నిర్మాణానికి ఇంకా స్థలం కూడా కేటాయించలేదు.
CM Jagan Visits Polavaram Flood Victims: సీఎం జగన్ పోలవరం ముంపు ప్రాంతాల పర్యటన.. గత హామీల మూట ఏమైంది జగనన్నా..?
పట్టించుకున్న నాథుడే లేరు: వరదల సమయంలో నిర్వాసిత కాలనీల్లో వైద్య సదుపాయం కల్పించేందుకు.. తాడువాయిలో ఏర్పాటు చేసిన వైద్య కేంద్రంలో ప్రస్తుతం సేవలు నిలిపివేశారు. వరదల సమయంలో ఏఎన్ఎమ్లు, ఆశా కార్యకర్తలు ఇక్కడే ఉండి చికిత్స చేసి మందులు ఇచ్చేవారు. అయితే వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తాళాలు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇక్కడ ప్రతి రెండు ఇళ్లకు ఒకరు జ్వర పీడితులు ఉండగా.. కొందరు మంచాన పడ్డారు. వైరల్ జ్వరాలతో ఇబ్బంది పడుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
20 కిలోమీటర్లు వెళ్లాల్సిందే: వైద్యం చేయించుకోవాలంటే.. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంగారెడ్డి గూడెంలోని ప్రాంతీయ ఆసుపత్రికి లేదా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలి. ఉన్న ఒక్క బస్సు ఎప్పుడు వస్తుందో తెలియక.. ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేసుకుంటే రానుపోను వెయ్యి రూపాయలు చెల్లించాల్సి వస్తోందని.. నిర్వాసితులు చెబుతున్నారు. ఆసుపత్రిలో ఖర్చు కంటే రవాణా వ్యయమే ఎక్కువ అవుతుందని నిర్వాసితులు వాపోతున్నారు. ప్రభుత్వం తమ గోడును ఆలకించి.. త్వరితగతిన ఆస్పత్రులు నిర్మించాలని.. నిర్వాసితులు విన్నవించుకుంటున్నారు .
ఓ వైపు గుండెల నిండా బాధ.. మరోవైపు నిర్దయగా వ్యవహరిస్తున్న అధికారులు
"నాకు గత నాలుగు రోజులుగా జ్వరం ఉంది. నాకు ఒక్కడికే కాకుండా ఇక్కడ ప్రతి కుటుంబంలో ఇద్దరు చొప్పున జ్వరాలతో ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ క్యాంపులు.. కేవలం ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు మాత్రమే పెడుతున్నారు. తరువాత పట్టించుకోవడం లేదు. ఇవాళ విపరీతమైన జ్వరాలు ఉన్నా సరే ఇటువైపు ఎవరూ తిరిగి చూసిన దాఖలాలు లేవు". - కొంబత్తిన సుధాకర్, నిర్వాసితుడు
"మాకు అందరికీ జ్వరాలు, ఇతర ఇబ్బందులు వస్తున్నాయి. ఇక్కడ మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆర్ఎంపీ డాక్టర్లతో వైద్యం చేపించుకుంటున్నాం. ఇక్కడ ప్రభుత్వం ఆసుపత్రి పెడితే మాకు ఏ ఖర్చులు ఉండవు. ఏమీ లేని పేదవాళ్లం వేరే దగ్గరకి వెళ్లి వైద్యం చేపించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి హాస్పిటల్ ఏర్పాటు చేస్తే మా కష్టాలు తీరుతాయని అనుకుంటున్నాం". - మాణిక్యం, నిర్వాసితురాలు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల దీనగాథలు