ఇప్పటికైనా బాగుచేయండి సారూ.. నరకప్రాయంగా కుక్కునూరు రోడ్డు Road condition in AP: ఇది తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావు పేట నుంచి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి. మన రాష్ట్రంలోని ఏలూరు జిల్లా కుక్కునూరు మండల కేంద్రానికి చేరుకోవాలంటే అశ్వారావు పేట నుంచి ఇటుగా రావాల్సిందే. తెలంగాణలోని అటు అశ్వారావుపేట, ఇటు భద్రాచలానికి మధ్యలో పోలవరం ముంపు మండలమైన కుక్కునూరు ఉంటుంది. పక్క రాష్ట్రం నుంచి ఈ మార్గం గుండా మన రాష్ట్రం వచ్చేవారైనా.. లేదా మన రాష్ట్రం నుంచి భద్రాచలం వెళ్లేవారు ఎవరైనా సరే.. వారికి ఇక్కడ రోడ్ల పక్కన ఏర్పాటు చేసే ఊరి పేర్లతో కూడిన బోర్డులు కానీ.. సూచిక బోర్డులతో కానీ పనిలేదు. ఎందుకంటే వాళ్లు రోడ్ల స్థితిని బట్టి తెలంగాణలో ఉన్నామో.. ఆంధ్రాలో ఉన్నామో ఇట్టే చెప్పేస్తారు. ఇలా రోడ్ల పరిస్థితిని బట్టి ప్రాంతం గుర్తుపడుతున్నారంటే.. ఈ రోడ్లు ఎంత నరకప్రాయంగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అశ్వారావుపేట నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో కుక్కునూరు మండల కేంద్రం ఉండగా.. కుక్కునూరు నుంచి భద్రాచలానికి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇటు అశ్వారావుపేట దాటి ఆంధ్రా సరిహద్దు ప్రారంభమైన దగ్గర నుంచి అటు భద్రాచలం సమీపించే వరకు కూడా సుమారు 45 కిలోమీటర్లకు పైగా రహదారి దారుణంగా తయారైంది. ముఖ్యంగా కుక్కునూరు మండల కేంద్రానికి రెండు వైపులా రోడ్లపై అగాథాలను తలపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ రోడ్లపై రాకపోకలు సాగించే ప్రయాణికులు.. అసలు రోడ్డు ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్లాల్సిన పరిస్థితి.
రోడ్లు భవనాల శాఖ పరిధిలోని ఈ రోడ్ల దుస్థితి సుమారు నాలుగేళ్ల నుంచి ఇలాగే ఉన్నా పట్టించుకున్న నాథుడు లేడు. రోడ్లను బాగు చేయమని ఎవరికి మొరపెట్టుకున్నా.. ఆలకించేవారే కరవయ్యారు. ద్విచక్రవాహనం నుంచి ఆర్టీసీ బస్సు వరకూ ప్రయాణ సాధనమేదైనా సరే.. ఈ రోడ్లపై ప్రయాణిస్తే ఒళ్లు హూనమే. ఇక వాహనాల సంగతి సరేసరి. రోడ్లు పూర్తిగా ధ్వంసమైనా.. చిన్నపాటి వర్షానికే చెరువులను తలపిస్తున్నా.. కొత్త రోడ్డు వేయడం గానీ, కనీసం మరమ్మతులు చేసే దిక్కుకూడా లేదు. ఇటు వైపుగా ప్రయాణం అంటేనే బాబోయ్ అనేంతలా ఈ రోడ్లు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి.
ఏజెన్సీ ప్రాంతం కావడం, తరచూ ముంపునకు గురికావడంతో కుక్కునూరు అభివృద్ధిని అధికారులు గాలికి వదిలేశారు. ముంపు సాకు చూపి కనీసం రోడ్లు కూడా బాగు చేయడం లేదని, ఏళ్ల తరబడి పాడైపోయిన రోడ్లపై ప్రయాణం చేయలేక నరకయాతన అనుభవిస్తున్నామనిస్థానికులు గగ్గోలుపెడుతున్నారు. సరిహద్దు దాటి పక్క రాష్ట్రం తెలంగాణలో అడుగుపెడితే ప్రయాణం సాఫీగా సాగుతుందని.. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు దారుణంగా తయారయ్యాయని, వాహనాలు సైతం తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. రోడ్ల విషయంలోనే అటు వాహనదారులు, ఇటు స్థానికులు మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రంతో పోలుస్తూ తరచూ తిట్టిపోస్తున్నా అధికారుల్లో ఏమాత్రం చలనం కనిపించడంలేదు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం, ఆర్అండ్బీ అధికారులు స్పందించి రోడ్లు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.