ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరంతో ముంపు ముప్పు లేదు.. కేంద్ర జలసంఘం స్పష్టీకరణ - పోలవరం ప్రాజెక్టు

Clarification On Polavaram Flood: పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ముంపు, ముప్పూ ఉండబోదని కేంద్ర జలసంఘం స్పష్టం చేసింది. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు తోసిపుచ్చిన కేంద్రం జలసంఘం ఇప్పటికే అధ్యయనం పూర్తైందని, మరోసారి అధ్యయనం చేసే అవకాశమే లేదని తేల్చిచెప్పింది. కేంద్రానికీ ఇదే విషయాన్ని నివేదిస్తామని తెలిపింది.

పోలవరం
polavaram

By

Published : Jan 26, 2023, 8:06 AM IST

Updated : Jan 26, 2023, 1:08 PM IST

పోలవరంతో ముంపు ముప్పు లేదు.. కేంద్ర జలసంఘం స్పష్టీకరణ

Clarification On Polavaram Flood: పోలవరం ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ముంపు ముప్పంటూ అభ్యంతరాలు లేవెనత్తిన రాష్ట్రాల అనుమానాలు నివృత్తి చేసి పరిష్కారం కనుగొనాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. బుధవారం కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కుష్వీందర్‌ ఓరా అధ్యక్షతన దిల్లీలో సాంకేతిక అంశాలపై భాగస్వామ్య రాష్ట్రాలతో సమావేశం జరిగింది.

ఏపీ నీటిపారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి, తెలంగాణ నుంచి ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నాగేంద్రరావు, ఒడిశా ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అశుతోష్‌, తదితరులు హాజరయ్యారు. గోదావరికి ఇంతవరకూ గరిష్ఠంగా 36 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చిందని, 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలను అంచనా వేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని జలసంఘం ఛైర్మన్‌ కుష్వీందర్‌ ఓరా స్పష్టం చేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇప్పటికే పోలవరం బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై కేంద్ర జలసంఘం అధ్యయనం పూర్తిచేసిందని, ఇదే విషయాన్ని కేంద్రానికి నివేదిస్తామని ఆయన స్పష్టం చేశారు.

2022 జులై, ఆగస్టు నెలల్లో గోదావరికి వచ్చిన వరద వల్ల భద్రాచలం, మణుగూరు, బూర్గంపాడు సహా మరో ఆరు గ్రామాలు 891 ఎకరాలు ముంపులో చిక్కుకున్నాయని తెలంగాణ రాష్ట్రం చేసిన వాదనను కేంద్ర జలసంఘం తోసిపుచ్చింది. పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు ఆ స్థాయిలో ఉండబోదని స్థానిక భౌగోళిక పరిస్థితుల వల్ల అలాంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చని తెలిపింది. ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి సైతం తెలంగాణ వాదిస్తున్నట్లుగా ఆ ప్రాంతాలేవీ ముంపులో ఉండబోవన్నారు. పోలవరం జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరితే ఎంత వరకు నీళ్లు నిల్వ ఉంటాయో ఇప్పటికే సర్వేరాళ్లు ఏర్పాటు చేశామని నారాయణరెడ్డి వివరించారు. తెలంగాణ అధికారులు వస్తే వాటిని చూపిస్తామని తెలిపారు. ముంపు ప్రాంతాలంటే పునరావాసం కింద నిధులిచ్చి వాటిని తీసుకుంటామని వెల్లడించారు.

ఐతే కిన్నెరసాని, ముర్రేడు వాగు సహా 36 స్థానిక పథకాలకు ముంపు ప్రభావం ఉందని తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నాగేంద్రబాబు అభ్యంతరం తెలిపారు. కిన్నెరసాని, ముర్రేడు వాగులపై ఉన్న ప్రభావాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు నివేదించామని ఏపీ ఈఎన్‌సీ స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని నారాయణరెడ్డికి కేంద్ర జలసంఘం సీఈవో కుష్వీందర్‌ ఓరా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఏ విషయం తెలియజేస్తామని ఏపీ ఈఎన్‌సీ తెలిపారు.


ఇవీ చదవండి

Last Updated : Jan 26, 2023, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details