Tuberculosis Prevention Day: క్షయ వ్యాధి నివారణకు సంబంధించి 8 జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేసుకుని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మరోసారి తన సత్తాను చాటింది. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవ సందర్భంగా ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరిగిన ప్రపంచ క్షయ నివారణ సదస్సు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. అధికారులకు ఈ అవార్డులను అందజేశారు. దేశంలోని రాష్ట్రాలు, జిల్లాలను క్షయ రహితంగా తీర్చి దిద్దటంలో అధికారులు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డులను ప్రదానం చేశారు.
దేశవ్యాప్తంగా 337 జిల్లాలో అమలు జరిగిన ఈ కార్యక్రమంలో 18 జిల్లాలు స్వర్ణ పతకాలను, 28 జిల్లాలు రజిత పతకాలను, 65 జిల్లాలు కాంశ్య పతకాలను సొంతం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏలూరు జిల్లా స్వర్ణ పురస్కారాన్ని దక్కించుకోగా, విశాఖ పట్నం, కోనసీమ జిల్లాలు రజిత పురస్కారాలను.. శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు.. కాంశ్య పతకాలను అందుకున్నాయి. 2015-2022 మధ్య కాలంలో క్షయ వ్యాధి నివారణకు ఆయా జిల్లాల అధికార యంత్రాంగం చేసిన పనితీరుకు గుర్తింపుగా ఈ అవార్డులను అందచేశారు.