నరేంద్రపురం నుంచి కలవచర్ల వెళ్లే రహదారిలో ఎనిమిది ఎకరాల్లో పందిళ్లపై వివిధ రకాల కూరగాయలు వేలాడుతూ ఆకుపచ్చని పంటతో కళకళలాడుతూ దర్శనమిస్తుంది. నరేంద్రపురం గ్రామానికి చెందిన ప్రగడ రాంబాబు.. ఎనిమిది ఎకరాల పంట భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఉద్యాన శాఖ అధికారుల సలహాలతో సేంద్రియ ఎరువులను అధికంగా ఉపయోగిస్తూ.. పందిరి సేద్యం ద్వారా వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నాడు. పంట భూమి వద్దే కూరగాయల దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని తాను పండించిన కూరగాయలను నామమాత్రపు లాభంతో విక్రయిస్తున్నాడు. నాణ్యమైన ఉత్పత్తులు కావడం తాజా సరకు సైతం అందుబాటులో ఉండటం అందరూ రాంబాబు దగ్గరకే వస్తున్నారు.
రాంబాబు.. ఏటా మూడు పంటలు పండిస్తున్నప్పటికీ మొదటి రెండు పంటలు బీర, దొండ, కాకర , సొర వేశారు. అంతర పంటలుగా మిర్చి, వంకాయ, బొబ్బర్లు పండిస్తున్నారు. రెండేళ్లలో ఆరు రకాల పంటలు వేశారు. కూరగాయల సాగుకు పందిరి సేద్యంలో మాల్పింగ్ షీట్ లను ఉపయోగించి విత్తనాలు వేసేందుకు వీలుగా ఆ సీట్లకు అక్కడికక్కడే రంధ్రాలు చేశారు. అలా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటి వృథాను అరికట్టారు. మొక్కలకు ఎరువులను నీటిలో కలిపి డ్రిప్ పైపుల ద్వారా అందిస్తున్నారు.