కనుచూపుమేరంతా కొబ్బరి చెట్లు, గోదావరి నది నుంచి వచ్చే పిల్ల గాలులతో ఆహ్లాదకరంగా ఉంటుంది యానాం. తన అందాలతో పర్యాటకుల్ని ఆకర్షించే ఈ ప్రాంతం... ప్రస్తుతం కరోనాతో బోసిపోయింది. సెలవులు, పండగలు, వివాహ ముహూర్తాల సందర్భాల్లో వేల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వంద అడుగుల ఎత్తైన యానాం టవర్... గోదావరి నదిలో విహారం... ప్రతి శని, ఆదివారాల్లో సాయంత్రం వేళ ప్రదర్శించే మ్యూజికల్ లైట్ లేజర్ షో ఎంతగానో ఆకర్షించేవి. పర్యాటక శాఖకు రోజుకు రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం సమకూరేది. ఇదంతా గతం... ప్రస్తుతం ఈ ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.
కరోనా ప్రభావంతో మార్చి నెల 24 నుంచి అన్ని పర్యాటక ప్రాంతాలు మూతబడి యానాం పర్యాటకం కుదేలైంది. నిత్యం జన సంచారంతో కలకలలాడే ప్రదేశాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. యానాంకు పూర్వవైభవం ఎప్పుడు వస్తుందా అని అధికారులు ఎదురు చూస్తున్నారు.