ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సేంద్రియ సాగులో సిరులు.. కూలిపని మాని సాగుబడిలో నారీమణులు

ప్రకృతి వ్యవసాయంతో నేలతల్లి నుదుటున పచ్చటి బొట్టు పెడుతున్నారు ఆ మహిళా రైతులు.  ‘మీకెందుకు ఈ వ్యవసాయం... ఏ కారప్పొడులో... పచ్చళ్లో పెట్టుకోక’ అన్న మాటల్ని సవాలుగా తీసుకుని... సేంద్రియ సాగుతో ఉమ్మడిగా లాభాలు గడిస్తున్నారు. జీవితాల్ని అభివృద్ధి పథంలో నడిపించుకుంటున్నారు.

women doing organic farming at east godavari
women doing organic farming at east godavari

By

Published : Apr 7, 2021, 1:32 PM IST

‘మార్పు కావాలని కోరుకుంటే సరిపోదు..అందుకు తొలి అడుగు మాదే అవ్వాలనుకున్నాం’ అంటారు తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం... వెంకటాపురం గ్రామంలోని మహిళా బృందం. ‘ఏటికేడు ఏ కూర వండుకున్నా, పండు తిన్నా రుచి తగ్గిపోతుంది ఎందుకో అనుకునేవాళ్లం. క్యాన్సర్‌ వంటి ప్రమాదకరమైన రోగాల బారిన పడుతున్న వారి గురించి తెలుసుకున్నప్పుడల్లా...ఆహార ఉత్పత్తుల సాగులో పురుగు మందుల వినియోగం తగ్గితే బాగుండునని మాట్లాడుకునే వాళ్లం. కానీ ఎవరు చేస్తారు? ఎక్కువ దిగుబడులు కావాలంటే..అదే దారి అని రైతులంతా భావిస్తున్నారు. అలాంటి ఆలోచనల్లో ఉన్నప్పుడే... అంటే 2016లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం కమ్యూనిటీ మేనేజ్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ని ప్రారంభించింది. అందుకోసం మా వెంకటాపురం గ్రామాన్ని ఎంపిక చేశారు. కానీ అవగాహనా లేమితో ఎవరూ ముందడుగు వేయలేదు. అయితే అధికారులు చెప్పిన వివరాలు మాకు ఆసక్తిని కలిగించాయి. మేమంతా ఉపాధికోసం వ్యవసాయ పనులూ చేస్తుంటాం. మనమే ఆ పనిచేస్తే అని చర్చించుకున్నాక...సరే అన్నాం’ అంటారు బాపనమ్మ మహిళా స్వయం సహాయక డ్వాక్రా గ్రూపులో ఒకరైన అంకంరెడ్డి సూర్యుడమ్మ. ఈవిడ ఉత్తమ మహిళా రైతుగానూ అవార్డును అందుకున్నారు.

వీళ్లు ఖాళీ స్థలాల్లో, ఇంటి ఆవరణలో పెరటి పంటలు పండించడం ప్రారంభించారు. మెరుగైన ఫలితాలు ఇవ్వడంతో... కొంత పంటను తమకోసం ఉంచుకుని మిగిలినవాటిని బంధువులు, స్నేహితులకు పంచేవారు. తొలుత ఐదెకరాల్లో సేద్యం చేశారు. ఈ విషయం చుట్టుపక్కల ఊర్లకు చేరింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి... ఫలానాది దొరుకుతుందా అని అడిగేవారు. ఇదంతా ఆ మహిళల్లో మరింత ఉత్సాహం కలిగించడంతో... కొందరు సొంత పొలాల్లో, మరికొందరు కౌలుకి తీసుకుని ప్రకృతివ్యవసాయం మొదలుపెట్టారు. ఇలా లాభాలు అందుకోవడమే కాదు...తమ జీవితాల్లోనూ గణనీయమైన మార్పు తెచ్చుకున్నామంటున్నారు. ‘ఒకప్పుడు కూలి పనులు చేసేదాన్ని. ప్రకృతిసాగు నేర్చుకుని ఇంటి పక్కనే కూరగాయలు పండించే దాన్ని. తర్వాత ఎకరంన్నర కౌలుకి తీసుకుని సేంద్రియ సేద్యం మొదలుపెట్టా. పిల్లల పెళ్లిళ్లు చేశా. ఇల్లూ కట్టుకున్నా’ అని సంతోషపడ్డారు ఈ గ్రూపులోని కారం లక్ష్మి.

ఆరు డ్వాక్రా బృందాలు...
ఒక గ్రూపుతో ప్రారంభమైన సాగు యజ్ఞంలో ప్రస్తుతం ఆరు డ్వాక్రా బృందాలు పనిచేస్తున్నాయి. మొత్తం 60 మంది మహిళా రైతులు, 72 ఎకరాల్లో పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అత్యధికంగా వరిని పండిస్తూ, ఎకరాకు 35 బస్తాల దిగుబడి సాధిస్తున్నారు. వరి, కూరగాయలు, బంజరుగా ఉన్న కొండపోడుల్లో మామిడి, జీడి తోటలు వేశారు. పత్తి, చిరుధాన్యాలు, కందులు, పసుపు, అల్లం, చేమదుంపలు వంటి అంతరపంటలూ పండిస్తున్నారు. దిగుబడులు, ఈ పంటలకు ఉన్న డిమాండ్‌ చూసిన ఇతర రైతులూ ముందుకు వచ్చారు. ‘నేను జీడిమామిడి అంతరపంటలుగా చిరుధాన్యాలు, పసుపు వంటివి పండిస్తున్నా. అంతా ‘వ్యవసాయం కలిసి రాదు...ఎందుకీ ప్రయోగాలు’ అన్నా పట్టించుకోలేదు. ఇప్పుడు అదే మా భవిష్యత్తుని మార్చింది. మా ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. అమ్మాయిని వెటర్నరీ మెడిసిన్‌ చదివించగలుగుతున్నా’ అంటోంది తుర్రం సత్యవతి.

మాటలూ పడ్డారు...
వ్యవసాయమంటే ఆదాయం గడించడానికే కాదు.. పదిమందికీ ఆరోగ్యం పంచడానికంటారు ఈ మహిళా రైతులు. అందుకే సామూహిక వ్యవసాయం మొదలెట్టారు. ఆవు పేడ, మూత్రం, పాలు, మజ్జిగ, సెనగపిండి, పాతబెల్లం, పుట్టమన్ను తదితర సహజ ఉత్పత్తులు కలిపి కషాయాలు, ఎరువులు తయారు చేస్తారు. మందు పిచికారీ నుంచి కోతలు పూర్తయ్యేవరకూ కలిసికట్టుగా శ్రమిస్తారు. ఈ ఐదేళ్లలో వెంకటాపురం మహిళలు ప్రకృతి వ్యవసాయంలో నిష్ణాతులుగా మారారు. పక్క గ్రామాలు, మండలాల్లోనూ ఈ సాగు పద్ధతుల మీద అవగాహన కల్పిస్తున్నారు.

‘మొదట్లో పంట తక్కువగా వచ్చేది.. తెగుళ్లకు ఏ మందు ఎంత మోతాదులో వాడాలి.. ఎలా తయారు చేయాలో తెలిసేది కాదు. మావన్నీ చిన్న కమతాలు. విడివిడిగాకంటే...కలిసి కట్టుగా చేయడం మంచిదని నిర్ణయించుకున్నాం. పంట వేసిన దగ్గర నుంచి కోత కోసేవరకూ...ఒకరికొకరు సాయం చేసుకుంటాం. ప్రకృతి విపత్తులు, తెగుళ్ల వంటివీ తట్టుకుని ఆర్థికంగా బలోపేతమయ్యాం’ అంటున్నారు మంగారత్నం. ఒకప్పుడు పూరి గుడిసెలో నివాసముండే ఆమె...ఐదేళ్లలోనే సొంతంగా ఇల్లు కట్టుకోగలిగింది. ఈ మహిళల విజయ ప్రస్థానం స్ఫూర్తిదాయకం.

ఇదీ చదవండి:తెలుగు బిడ్డకు సర్వోన్నత గౌరవం

ABOUT THE AUTHOR

...view details