అమలాపురంలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. కాటన్ రోడ్డులో ఈ దుర్ఘటన జరిగింది. సమనస గ్రామానికి చెందిన కొండ్రు కోటేశ్వరరావు, మంగం చిరంజీవి కుటుంబాల మధ్య ఇంటి సరిహద్దు విషయంలో కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఇవాళ ఇరువురు గొడవపడ్డారు. కోటేశ్వరరావు అమలాపురంలో ఉన్న తన భార్య దుర్గను తీసుకురమ్మని కుమారుడు రమేశ్‌ను పంపాడు.
ఈ మాటలు విన్న చిరంజీవి కుమారులు విజయ్, నవీన్ వారికున్న మినీ వ్యాన్‌లో అమలాపురం వచ్చి మోటార్ సైకిల్‌పై వెళుతున్న తల్లి దుర్గ, కుమారుడు రమేష్‌లపై మారణాయుధాలతో దాడి చేశారు. దుర్గను కిరాతకంగా హత్య చేశారు. ప్రత్యర్థుల దాడిలో కుమారుడు రమేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా ప్రదేశాన్ని అమలాపురం డీఎస్పీ వై.మాధవ రెడ్డి పరిశీలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.