Difficulty Of Paddy Farmers To Sell Grain : వర్షాలు తగ్గడంతో వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్న వేళ... పంట కొనుగోళ్లు మాత్రం మందకొడిగా సాగుతున్నాయి. రైతు భరోసా కేంద్రాలు నామమాత్రపు కొనుగోళ్లతో అన్నదాతకు మొఖం చాటేస్తున్నాయి. ఇదే అదునుగా మధ్యవర్తులు తక్కువ ధరకే అడుగుతుండటంతో సాగుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. బొండాలు రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో.... రైతు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇదీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కర్షకుల దుస్థితి.
ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం :పంట పండించడానికే కాదు. దాన్ని అమ్ముకోవడానికీ రైతుకు పాట్లు తప్పడం లేదు. అకాల వర్షాలతో వరికోతలకు తీవ్ర ఆటంకం ఏర్పడిన గోదావరి డెల్టాలో వాన తగ్గడంతో మిగిలిన పంట కోతలు జోరుగా సాగుతున్నాయి. కోనసీమ జిల్లాలో అధిక శాతం పంట ఇంకా రైతుల వద్దే ఉంది. కోతలు ముమ్మరంగా సాగుతున్నా వాటి విక్రయాలు మాత్రం ఆశించిన స్థాయిలో జరగక రైతులు అవస్థలు పడుతున్నారు. రబీ సీజన్‌లో 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా వేయగా ఇప్పటి వరకు సుమారు 88 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. బొండాలు రకం మాత్రం ప్రభుత్వం సేకరించక పోవడంతో అన్నదాతలు కళ్లాల్లో ఆరబెట్టి కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. దళారులు తక్కువ ధరకే అడుగుతుండటంతో గిట్టుబాటు ధర రాక దిగులు చెందుతున్నాడు.