Drug Supplier Edwin Custody : తెలంగాణ రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిచయాలు.. ఏ మూలకైనా సరకు చేరవేయగల భారీ నెట్‌వర్క్.. రాజకీయ, పోలీసు యంత్రాంగాలతో పైరవీలు.. వారాంతంలో ప్రత్యేకంగా థీమ్ పార్టీలతో హంగామా.. వెరసి గోవా డ్రగ్ సూత్రధారి ఎడ్విన్ న్యూన్స్(45) ఏకంగా చీకటి సామ్రాజ్యాన్నే సృష్టించాడు. రేయింబవళ్లు విందు, వినోదాలతో కుర్రకారును మత్తులో ముంచేస్తున్నా.. కొందరు పోలీసులు చూసీచూడనట్టు వదిలేసేవారు. ఇతర రాష్ట్రాల పోలీసులు దాడులకు వెళ్లినప్పుడు అతగాడిని ముందుగానే అప్రమత్తం చేసేవారు. అంతటి కరడుగట్టిన ఎడ్విన్‌ను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ నార్కొటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్.న్యూ) పోలీసులు 3 నెలలు తీవ్రంగా శ్రమించారు. గోవాలోనే మకాం వేసి ముమ్మరంగా గాలించారు. ఎడ్విన్‌ను గురువారం హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. ఇంతకాలం పోలీసుల కంటబడకుండా అతడు ఎన్నో ప్రయత్నాలు చేసినట్టు దర్యాప్తులో గుర్తించారు.
సర్వర్ నుంచి స్మగ్లర్‌గా..ఎడ్విన్.. హోటల్ సర్వర్‌గా జీవితం ప్రారంభించి డ్రగ్ స్మగ్లర్‌గా ఎదిగాడు. హోటల్‌కు వచ్చే విదేశీయులతో పరిచయాలు పెంచుకొని మత్తుపదార్థాలు విక్రయిస్తూ కొద్ది సమయంలోనే వ్యాపారిగా మారాడు. పోలీసు, రాజకీయ నాయకుల సన్నిహిత సంబంధాలతో చెలరేగాడు. తనవైపు కన్నెత్తి చూడకుండా డబ్బుతో నోళ్లు నొక్కేశాడు. రూ.కోట్లు కూడబెట్టి గోవా, ముంబయిల్లో మామ సెబాస్టియన్ సహకారంతో పెద్దఎత్తున ఆస్తులు కొన్నాడు. సినీ పరిశ్రమలో ఎంతోమందికి ఆర్థిక సహకారం అందిస్తుంటాడు. ప్రత్యేక సందర్భాల్లో పబ్‌లలో వేడుకలకు సినీతారలను ఆహ్వానించేవాడని సమాచారం.