ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా వేళ.. వేతనాలకు కటకట - temples in Andhra Pradesh

కరోనా వేళ ప్రసిద్ధ ఆలయాల్లో దర్శనాలు ఆపేసిన తరుణంలో.. సేవలు, కానుకల రూపేణా ఎలాంటి సొమ్ము దరి చేరక ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాలకూ వేతనాలకూ దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఆర్ధికంగా దీవాలా తీసిన తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం, అంతర్వేది ఆలయాల పరిధిలోని క్లిష్ట తరుణంపై ఈటీవీ భారత్​ కథనం.

temples in finance crisis due to corona effect
కరోనా వేళ.. వేతనాలకు కటకట

By

Published : Sep 29, 2020, 5:56 PM IST

కరోనా వేళ ప్రసిద్ధ ఆలయాల్లో దర్శనాలు ఆపేసిన తరుణంలో.. ఎలాంటి ఆదాయం మార్గాలు లేక ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. ఉద్యోగుల జీతాలకూ కటకటగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది. ఆర్థిక సంవత్సరంలో ఆదాయ లక్ష్యం పూర్తిగా తిరోగమనంలోకి వెళ్లింది. కొన్ని నెలలుగా ఉద్యోగులకు సగం జీతాలు మాత్రమే చెల్లిస్తున్నారు. మరో రెండు రోజుల్లో చెల్లించాల్సిన సెప్టెంబరు వేతనాలకూ దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. శాశ్వత నిధి నుంచి కొంత మొత్తం తీసుకొనే వెసులుబాటు కోసం ఉన్నతాధికారులు చొరవ చూపుతున్నారు.

అన్నవరం దేవస్థానం ఆదాయం..

ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు తగ్గుతుందని అంచనా. ఈ పరిస్థితుల్లో కొన్నాళ్లుగా దేవస్థానం ఉద్యోగులకు కేవలం 50 శాతం మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారు. మిగిలిన 50 శాతం బకాయిల చెల్లింపు, పూర్తి జీతాలు ఇవ్వాలంటే ఏం చేయాలో తెలియకుంది. దర్శనాలు పునరుద్ధరించినా రద్దీ లేక ఆదాయం గగనమైంది.

శాశ్వత నిధి నుంచి తీసేలా..

జీతాల చెల్లింపుల కోసం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నుంచి రూ.10 కోట్లు తీసి.. ఆ తరువాత జమ చేసేలా అనుమతి ఇవ్వాలని ధర్మకర్తల మండలి కమిషనర్‌కు ప్రతిపాదించింది. ఈలోగా నిత్యాన్నదాన ట్రస్ట్‌కు వడ్డీ రూపంలో వచ్చిన రూ.70 లక్షలను జీతాలుగా చెల్లించి తర్వాత ట్రస్ట్‌ ఖాతాలో వేసేలా అనుమతి కోరినా ఇంకా రాలేదు. దీంతో ఉద్యోగ ప్రతినిధులు తాజాగా ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ ద్వారా విజయవాడ వెళ్లి దేవాదాయ కమిషనర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

పూర్తి జీతాలు చెల్లించేదెలా?

  • ఇదీ పరిస్థితి: దేవస్థానంలో శాశ్వత, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు సుమారు 485 మంది ఉన్నారు. వీరికి, పింఛనుదారులకు కలిపి నెలకు రూ.2 కోట్లు పైగా చెల్లించాల్సి ఉంది.
  • కొద్ది నెలలుగా ఉద్యోగులకు 50 శాతం జీతాలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇప్పటికి రూ.4.9 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీరిలో ఉద్యోగ విరమణ చేసిన వారికి చెల్లించాల్సిన ప్రయోజన సొమ్ము సైతం ఉంది.
  • ఈ బకాయిలు, సెప్టెంబరు జీతం చెల్లించాలంటే ఎఫ్‌డీఆర్‌లో సొమ్ము తీయడం తప్ప మరోమార్గం లేదు. లేకుంటే ఎంత ఉంటే అంత ఇవ్వాల్సిందే.
  • పురోహితులకు వ్రత టికెట్ల ఆదాయంలో 30 శాతం కమీషన్‌ ద్వారా చెల్లించే స్థిర పారితోషికం ఇవ్వలేని పరిస్థితి వస్తుండటంతో తమ కార్పస్‌ ఫండ్‌ నుంచి ఇవ్వాలని కోరుతున్నారు.

రెండు నెలలుగా నిరీక్షణే..

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాల్లేక తల్లడిల్లుతున్నారు. స్వామికి ఉభయగోదావరి జిల్లాల్లో 927.27 ఎకరాల భూములున్నాయి. వీటి నుంచి ఏడాదికి శిస్తుగా రూ.35 లక్షల ఆదాయం వస్తుంది. హుండీలు, ఇతర పూజలతో రూ.4.26 కోట్లు సమకూరుతుంది. ఆలయంలో 17 మంది శాశ్వత, 68 మంది ఒప్పంద ఉద్యోగులున్నారు. వీరికి నెలకు రూ.15 లక్షల వరకు జీతాలకు అవసరం.

కరోనా తీవ్రతకు మార్చి 22- జూన్‌ 6 వరకు ఆలయాన్ని మూసేశారు. తర్వాత తెరిచినా భక్తుల సంఖ్య అంతంతే. మళ్లీ జులై 17-25, సెప్టెంబరు 14-25 వరకు దర్శనాలను ఆపేశారు. వెరసి దేవస్థానంలో ఆదాయంలేక, ఇటు శిస్తులు వసూలు కాక జీతాలు ఇవ్వలేకపోయారు. మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌కు సగం జీతం ఇవ్వగా, జులై, ఆగస్టుకు జీతాలు అందలేదు. మరో రెండు రోజుల్లో సెప్టెంబరు జీతంతో కలిపి చెల్లించడానికి రూ.45 లక్షలు అవసరం.

ఉన్నతాధికారులకు నివేదించాం

  • ఉద్యోగుల జీతాలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచి తీసుకొని.. ఆదాయం పెరిగాక మళ్లీ జమ చేసేలా అనుమతి ఇవ్వాలని ఉన్నతాధికారులకు నివేదించామని అన్నవరం ఇన్‌ఛార్జి ఈవో రమేశ్‌బాబు పేర్కొన్నారు.
  • ఉద్యోగులను ఆదుకునేందుకు శాశ్వత నిధి నుంచి సొమ్ము తీసుకునే వీలు కల్పించాలనీ.. లేదా బ్యాంకుల నుంచి రుణం తీసుకునే వెసులుబాటు ఇవ్వాలని దేవాదాయ శాఖ అధికారులను కోరామని అంతర్వేది ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ భద్రాజీ చెప్పారు.

ఇదీ చూడండి:

వ్యవసాయ పంటలకూ ఐక్యూఎఫ్ విధానం.. ప్రభుత్వం యోచన

ABOUT THE AUTHOR

...view details