జీవితంలో ఎదురయ్యే సమస్యలకు, సవాళ్లకు పరిష్కారం ఉంటుంది. దానికి కొంచెం ఓపిక, ప్రశాంతత కావాలి. అలా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కరించవచ్చు. కానీ కొంతమంది ప్రతి చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. పదేపదే దాని గురించే ఆలోచిస్తూ ప్రాణాలు విడుస్తున్నారు. ఈ విషయంలో చిన్నా.. పెద్దా అనే తేడా చూడట్లేదు.
చిన్న చిన్న కారణాలు..
ప్రాణం కంటే ఏది గొప్పది కాదు.. కష్టనష్టాలు వచ్చినా తాత్కాలికమే.. భవిష్యత్తు బాగుంటుంది అన్న నమ్మకంతో అడుగేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు. కానీ క్షణికావేశంతో ప్రాణాలు విడుస్తున్నారు.
- లింగాల మండలం ముర్రా చింతల శుక్రవారం తెల్లవారుజామున శివారెడ్డి వెంకటలక్ష్మి అనే వృద్ద దంపతులు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బలవన్మరణానికి పాల్పడ్డారు.
- ఓబులవారిపల్లె లో భర్త ఇంటికి రాలేదని మనస్థాపంతో కళ్యాణి అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
- కడపకు చెందిన వంశీకృష్ణ ప్రేమ వివాహాన్ని తల్లిదండ్రులు ఒప్పుకోలేదని మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
- కడప చింతకొమ్మదిన్నెకు చెందిన సుబ్రమణ్యం కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
- కడప జిల్లా మైలవరం మండలం దొమ్మర నంద్యాల కు చెందిన మాధవికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. మాధవి తన నాలుగు సంవత్సరాల కొడుకుతో కలిసి కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.