ప్రైవేటు విద్యాసంస్థలపై కరోనా ప్రభావం చాలా ఎక్కువగానే పడిందని చెప్పాలి. జూన్ మొదటి వారం నుంచి ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరం సందడి ఈ ఏడాది సెప్టెంబర్ మొదటివారానికి మారింది. ఈ విషయంపై విద్యాసంస్థలు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. తరగతిలో విద్యార్థుల సంఖ్య 80 నుంచి 40కి తగ్గించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు బోధనా సిబ్బందిని నియమించుకోవడం ప్రైవేటు విద్యాసంస్థలపై ఆర్థిక భారం పడనుంది. గడిచిన నాలుగు నెలలుగా ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు.
మనుగడ ప్రశ్నార్థకం
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రవేశాలు ఏ విధంగా ఉంటాయనేది సందేహంగానే ఉందని నిర్వహకులు అంటున్నారు. అద్దె భవనాల్లో విద్యాసంస్థలు నిర్వహిస్తున్న వారి పరిస్థితి మరింత ఘోరంగా ఉందంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదంటున్నారు. ఈ సమస్యను ఏ విధంగా అధిగమించాలో తోచని స్థితిలో ఉన్నామని ఆవేదన చెందుతున్నారు. విద్యార్థులు కట్టే ఫీజులు పైనే ఆధారపడి నిర్వహిస్తున్న విద్యాసంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.