తూర్పుగోదావరి జిల్లా మండపేట-ద్వారపూడి మధ్య ఉన్న రహదారి నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. జడ్. మేడపాడు, తాపేశ్వరం మీదుగా మండపేట వెళ్లే ఈ రహదారి తీవ్రంగా దెబ్బతింది. గోతులు, గుంతలతో ప్రయాణానికి ఏ మాత్రం అనువుగా లేదు. తీవ్రంగా ధ్వంసమైన రహదారికి మరమ్మతులు చేయాలని స్థానికులు అనేకసార్లు అధికారులకు మొర పెట్టుకున్నారు. అయినా ఎలాంటి పనులు జరగలేదు.
మండపేటకు చెందిన మూర్తి.. రోడ్డు దుస్థితిపై ఈ నెల 17న మెయిల్ ద్వారా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. స్పందించిన రాష్ట్రపతి కార్యాలయ అధికారులు.. మూర్తికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఫిర్యాదు కాపీని రాష్ట్ర ప్రభుత్వ సహాయ కార్యదర్శి జనార్దనబాబుకు పంపించారు. దీంతో శుక్రవారం రహదారి మరమతులను అధికారులు ఆఘమేఘాల మీద చేపట్టారు.