Prabhala Theertham Glory at Konaseema: సంక్రాంతి పర్వదినాల్లో కోనసీమలో నిర్వహించే అతిపెద్ద వేడుక ప్రభలతీర్థం. అంబాజీపేట, అయినవిల్లి, పి.గన్నవరం, అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం ముమ్మిడివరం, ఐ.పోలవరం, రాజోలు, మామిడికుదురు సహా పలు మండలాల్లో... ఏటా కనుమ పండుగ రోజున ప్రభుల తీర్థం ఘనంగా నిర్వహించడం ఆనవాయితి. అంబాజీపేట మండలం జగ్గన్నతోట ప్రభల తీర్థం 420 ఏళ్లకుపైగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. కనుమ రోజున ఏకాదశ రుద్రులు కొలువుతీరేది. దేశం మొత్తం మీద జగ్గన్నతోటలోనే అనేది భక్తుల విశ్వాసం.
మేళ తాళాలతో ఊరేగిస్తూ..
తాటి చెట్టు బద్దలు, మర్రివృక్షంతో చేసిన చక్కబల్లను నూలుతో గట్టిగా కట్టి వాటిపై ఉత్సవ మూర్తుల్ని ప్రతిష్ఠింపచేస్తారు. నెమలిపించాలు, నూతన వస్త్రాలతో చూడముచ్చటగా అలంకరింస్తారు. టన్నుల కొద్దీ బరువు ఉండే ప్రభల్ని 150 నుంచి 200 వందలమంది యువకులు మోస్తూ.. మేళ తాళాలతో ఊరేగిస్తూ 11 గ్రామాల నుంచి జగ్గన్నతోటకు తీసుకొచ్చారు. గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం నుంచి వరి పొలాల మీదుగా కౌశిక నది దాటి తీర్థ స్థలికి ప్రభలను తీసుకెళ్లారు. ఈ ఆద్యాత్మిక శోభను తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.