తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని సుకుమామిడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 1500 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి ప్రాంతం నుంచి కూలీల ద్వారా కాలినడకన సుకుమామిడికి గంజాయి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడి నుంచి పాత ఫర్నీచర్ తరలించే ఐషర్ వ్యాన్‌లో గుట్టుచప్పుడు కాకుండా యూపీలోని ముజాఫరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్నట్లు వివరించారు. ముగ్గురిని అరెస్ట్ చేయగా...మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
గుంటూరులో ముగ్గురు అరెస్టు..
లిక్విడ్ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు యువకులను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 21 లిక్విడ్ గంజాయి బాటిల్స్, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జెస్సీ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు గుంటూరు సౌత్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు.
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం కోటపాడు గ్రామానికి చెందిన గోగులమూడి శివన్నారాయణ.. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో మందు, సిగరెట్టు, పేకాట లాంటి చెడు వ్యసనాలకు బానిసైన శివన్నారయణకు సినిమా హాల్లో ఆపరేటర్‌గా పని చేస్తున్న కళ్లగడ్డ సమీర్ కుమార్, పిడుగురాళ్లకు చెందిన జంపు అమరలింగేశ్వర రావులతో పరిచయం ఏర్పడింది. చెడు వ్యసనాలకు బానిసై ఈ ముగ్గురు.. సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో లిక్విడ్ గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. శనివారం నల్లపాడు వద్ద బాటిళ్లలో లిక్విడ్ గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. లిక్విడ్ గంజాయి బాటిళ్లు, ఓ ద్విచక్రవాహం స్వాధీనం చేస్తున్నట్లు డీఎస్పీ జేస్సీ ప్రశాంతి వివరించారు.