ఓ వ్యక్తి వాణిజ్య పన్నుల శాఖ అధికారి కార్యాలయానికి అద్దెకు కారు తిప్పుతూ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ విధంగా అధికారులతో వెళ్లినపుడు అధికార దర్పం ఎలా ఉంటుందో తెలుసుకుని.. ఇక నకిలీ అధికారిగా అవతారమెత్తాడు. మరో ఇద్దరు స్నేహితులను వెంటబెట్టుకుని.. అధికారులమంటూ బెదిరింపులకు పాల్పడి డబ్బులు గుంజుతున్నారు. ముగ్గురు నకిలీ అధికారులపై పోలీసులు కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగింది.
అమలాపురానికి చెందిన కొప్పర్తి వీర షణ్ముఖం వాణిజ్య పన్నుల శాఖ అధికారి కార్యాలయానికి కారును అద్దెకి తిప్పుతూ డ్రైవర్గా పని చేస్తున్నాడు. పగలంతా విధులు నిర్వహిస్తూ రాత్రి సమయంలో నకిలీ అధికారిగా అవతారమెత్తి.. అమాయకులను దోచుకుంటున్నాడు. అతనితో పాటు మరో ఇద్దరు స్నేహితులు కాగితపల్లి శివన్నారాయణ, పాలగుమ్మి సూరిబాబు ఇలా ముగ్గురూ కలిసి ప్రజల వద్ద నగదు వసూలు చేస్తున్నారు.