ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధికే.. ఓ అపరిచిత వ్యక్తి టోకరా వేసి 2 లక్షల రూపాయలు కాజేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.
రాజమండ్రి క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్న ఓ వ్యక్తి.. అక్కడే ఉంటున్న మరో వ్యక్తి ఫోన్‌తో అమలాపురంకు చెందిన ఓ ప్రజా ప్రతినిధికి ఫోన్ చేశాడు. పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు స్వల్ప మెుత్తంలో నగదు డిపాజిట్ చేస్తే పెద్ద మెుత్తంలో లబ్ధి చేకూరుతుందని మాయమాటలు చెప్పి నమ్మించాడు. 2 లక్షల రూపాయల నగదును డిపాజిట్ చేసేందుకు ప్రజా ప్రతినిధి అంగీకరించారు. ఆ మాయగాడు తెలివిగా మరొకరి బ్యాంకు ఖాతా ఇచ్చి, దాంట్లో నగదును జమ చేయాలని చెప్పాడు. అతడు చెప్పిన ఖాతాకు ప్రజా ప్రతినిధి గూగుల్ పే ద్వారా ఆన్లైన్లో 2 లక్షలు పంపించారు. అనంతరం ఆ మాయగాడి నుంచి ఎటువంటి స్పందన లేక... మోసపోయానని గమనించిన ప్రజా ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు.