వేతనాల పెంపుదల, పీఎఫ్, ఈఎస్ఐ తదితర డిమాండ్స్ అమలు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కాకినాడ గ్రామీణ మండలం వాకలపూడి పంచాయతీ కార్మికులు అక్టోబర్ 14న ప్రారంభించిన ఆందోళన 28వ రోజైన మంగళవారం కూడా కొనసాగించారు. ఏప్రిల్ నెలలో ఎంపీడీవో హామీ ఇచ్చి, తీర్మానం చేసిన అంశాలను పంచాయతీ కార్యదర్శి అమల్లోకి తీసుకు రాకపోవడం వల్లనే అక్టోబర్ 14 నుంచి ఆందోళన చేపట్టడం జరిగిందని సీఐటీయూ నేతలు పేర్కొన్నారు.
నవంబర్ 5న డీఎల్పీవో, ఎంపీడీవో, ఈ.ఓ.పి.ఆర్.అండ్ ఆర్.డి. వంటి అధికారుల సమక్షంలో జరిగిన చర్చల్లో సానుకూలత వచ్చినా... పంచాయతీ కార్యదర్శి అమలుకు కృషి చేయకపోవడం సమంజసంగా లేదన్నారు. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం వీడి కార్మికులకు న్యాయం చేయాలని...లేని పక్షంలో బుధవారం నుంచి ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.