ఈ కలువపూలు పూసింది చెరువులోకాదు.. ఒకప్పుడు ధాన్యం సిరులు కురిపించిన పంటపొలాల్లో! ఒకప్పుడు రెండు పంటలు పండిన భూములు.. ఇప్పుడు చెరువుల్లా మారడానికి కారణం ఓన్‌జీసీ చమురు కార్యకలాపాలు. తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడిలంకలో.. వరి, అపరాలు ఏడాదిపొడవునా సాగయ్యేవి. ఇప్పుడు దాదాపు 165 ఎకరాలు.. ఇదిగో ఇలా చెరువులామారాయి.
ఓఎన్జీసీ (ONGC)ఇక్కడ 9 బావుల్లో.. చమురు, సహజవాయువు వెలికి తీస్తోంది. ఇందుకోసం 30ఏళ్ల క్రితమే పొలాల మధ్యలో నుంచి రోడ్లు వేశారు. అప్పటినుంచి పంట భూములు ముంపు బారిన పడుతున్నాయి. ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో నీరు ఇంకడంలేదు. ప్రస్తుతం నడుములోతు నీళ్లున్నాయి. ఖరీఫ్‌లో వరి పంట కోల్పోయినందుకు.. ఓఎన్జీసీ (ONGC) సంస్థ ఏటా రైతులకు పరిహారం ఇచ్చేది. నాలుగేళ్లగా అదీ నిలిపేశారని రైతులు.. వాపోతున్నారు.
ఏడాది పొడవునా నీరు నిల్వ ఉండటం వల్ల.. పొలం గట్లపై ఉన్న కొబ్బరి చెట్లు కూడా మోడు వారిపోతున్నాయి. వాటిద్వారా వచ్చే ఆదాయాన్నీ.. రైతులు కోల్పోతున్నారు. పొలాల్లోని నీరు బయటకెళ్లే.. పాశర్లపూడి డ్రైన్ కూడా పూర్తిగా పూడిపోయింది. మరమ్మతులు చేపట్టాల్సిన ఓఎన్జీసీ (ONGC) పట్టించుకోవంలేదు.