అంతర్వేదిలో అర్ధరాత్రి అలజడి... పరుగులు పెట్టిన జనం
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో గత అర్ధరాత్రి ఒక్కసారిగా అలజడి రేగింది. స్థానిక ఓఎన్‌జీసీ సైట్లో పైప్‌లైన్ లీకై ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాసన వచ్చిందని అక్కడి ప్రజలు చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో అర్ధరాత్రి ఓఎన్‌జీసీ పైప్‌లైన్ లీకేజీ కావటం ప్రజలను భ్రయభ్రాంతులకు గురిచేసింది. పైప్‌లైన్ లీకేజీతో సహజవాయువు భారీగా ఎగసిపడింది. సెయింట్ మేరీ పాఠశాల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు రెండు కిలోమీటర్ల మేర గ్యాస్ వాసన వచ్చిందని స్థానికులు తెలిపారు. ముందు జాగ్రత్తగా చుట్టు పక్కల ప్రాంతాల్లోని జనాన్ని, సెయింట్ మేరీ పాఠశాలలో ఉన్న సుమారు వెయ్యి మంది విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించారు. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న ఓఎన్‌జీసీ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్లీకేజీని నియంత్రించారు. ఇదే ప్రాంతంలో తరచూ గ్యాస్ లీకేజీతో జరుగుతోందని... 10సార్లు పైగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు చెప్పారు.