అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాల సమయానికి కొత్త రథం సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. రథం నిర్మాణానికి అవసరమైన కలపను ఎంపిక చేసేందుకు అధికారులు జిల్లాలోని అన్ని ప్రాంతాలను పరిశీలించారని... రావులపాలెంలో దొరికే కలప అనువుగా ఉందని గుర్తించారని మంత్రి తెలిపారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డితో కలిసి కలపను పరిశీలించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. సుమారు 80 రథాలు తయారు చేసిన గణపతి ఆచార్యులతోనే ఈ రథాన్ని తయారు చేస్తున్నామన్నారు.
అంతర్వేది ఘటనపై ఇప్పటికే సీబీఐ విచారణ ఆదేశించామని మంత్రి చెప్పారు. గతంలో తెలుగుదేశం-భాజపా హయాంలో అనేక ఘటనలు జరిగాయని..నాడు వాటిపై ఏ ఒక్కరూ మాట్లాడలేదని విమర్శించారు. నేడు కావాలని రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. శాంతికి రూపమైన తూర్పుగోదావరి జిల్లాను కులాలు, మతాలకు ఆపాదించవద్దని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కోరారు.