ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు - తూర్పుగోదావరి నేరవార్తలు

ఎవరి జీవిత ప్రయాణమైనా ఏదోక చోట ఆగాల్సిందే. శత్రువు చనిపోయినా అయ్యో పాపం అని జాలి చూపే నైజం మనది. కానీ కరోనా మహమ్మారి ప్రవేశించిన తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది. ఆ వైరస్‌ ఆరోగ్యానికే కాదు మానవత్వానికీ తూట్లు పొడుస్తోంది. కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని శ్మశాన వాటికలోకి వెళ్లకుండా అంబులెన్స్​ను స్థానికులు అడ్డుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.

కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు
కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు

By

Published : Jul 2, 2020, 12:00 PM IST

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని ఓ వృద్ధుడు కరోనా వ్యాధి రావడంతో రాజానగరం జీఎస్‌ఎల్‌ క్వారంటైన్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు రాజమహేంద్రవరం రోటరీ శ్మశానవాటికకు అంబులెన్స్​లో తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న స్థానికులు శ్మశాన వాటిక వద్ద కాపు కాసి నిరసన తెలిపారు.

మృతదేహాన్ని ఇక్కడ ఖననం చేయవద్దంటూ కొందరు యువకులు అంబులెన్స్​ను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు శ్మశానవాటిక వద్దకు వచ్చి ఆందోళనకారులకు సద్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినలేదు. కొద్దిసేపు పోలీసులు, స్థానికులకు వాగ్వాదం జరిగింది. నిబంధనల ప్రకారమే అంత్యక్రియలు చేస్తున్నట్లు అధికారులు స్థానికులకు వివరించారు. అనంతరం మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details