తూర్పు గోదావరి జిల్లా మామిడి తాండ్ర తయారీకి ప్రసిద్ధం. జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన ప్రత్తిపాడు, గొల్లప్రోలు, కత్తిపూడి, శంకవరం తదితర మండలాల్లో తయారీ యూనిట్లు విస్తృతంగా పెరిగాయి. గతంలో చేతి తయారీతో నడిచే తాండ్ర తయారీ పరిశ్రమల్లో ఇప్పుడు యాంత్రీకరణ పెరిగింది. పెద్ద యూనిట్లలో 200 నుంచి 300 మంది కూలీలు పని చేస్తున్నారు. చిన్న యూనిట్లలో 60 నుంచి 70 మందికి ఉపాధి లభిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వేసవిలో మాత్రమే తాండ్ర తయారీ జరుగుతుండగా... మరికొన్ని పరిశ్రమల్లో ఏడాది పొడవునా తయారు చేస్తున్నారు.
గడ్డిలో మగ్గబెట్టి...
మామిడి కాయలను ఎండుగడ్డి వేసి మగ్గబెడతారు. పండిన మామిడి ఫలాలను మరోసారి గ్రేడింగ్ చేస్తారు. తర్వాత వాటిని కోసి జ్యూస్ తీస్తారు. ఆ రసం మరిగించి కొద్దికాలం నిల్వ చేస్తారు. కొంతమంది తయారీదారులు మాత్రం వెంటనే బెల్లం, పంచదార కలిపి మిశ్రమంగా తయారు చేస్తారు. అనంతరం చాపలు పరిచి వాటిపై మామిడి రసం పోసి అధిక ఉష్ణోగ్రతలో ఎండబెడతారు. అప్పుడు ఆ మామిడి రసం మామిడి తాండ్రగా తయారవుతుంది. గట్టిబడిన మామిడి తాండ్రను ముక్కలుగా కోసి తెలుగు రాష్ట్రాలతోపాటు బీహార్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.