ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది తరహాలోనే మద్యం విక్రయాలు జరిగితే.. భారీగా పెంచిన ధరల వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.30 వేల కోట్ల వరకూ ఆదాయం వస్తుందని అంచనా. అంటే గతేడాది కంటే రూ.13 వేల కోట్ల మేర అదనపు ఆదాయమొచ్చే అవకాశముంది. గతేడాది మొత్తం విక్రయ విలువలో 84.60శాతం ఆదాయం.. లైసెన్సు రుసుములు, ఎక్సైజ్ సుంకం, వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, ప్రివిలేజ్ ఫీజు, రిటైల్ ఎక్సైజ్ సుంకం, అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకం తదితరాల రూపంలో ఇది సమకూరింది.
తాజాగా ప్రభుత్వం మద్యం ధరలు భారీగా పెంచిన నేపథ్యంలో... గతేడాది పరిమాణంలోనే మద్యం అమ్ముడైతే...దాని విలువ దాదాపు రూ.36,500 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ మొత్తంపై సుమారు 84 శాతం వరకూ వివిధ రకాల పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ లెక్కన రూ.30 వేల కోట్ల వరకూ ఆదాయం సమకూరే అవకాశముంది.
సాధారణంగా ఏటా అమ్ముడయ్యే మద్యం పరిమాణంలో వృద్ధి నమోదవుతుంటుంది. గతేడాది మాత్రం కొంత తగ్గుదల నమోదైంది. అమ్ముడైన మద్యం పరిమాణం తగ్గినా... అప్పటికే ఒకసారి మద్యం ధరలు పెంచటంతో.. అంతకు ముందేడాదితో పోలిస్తే ఆదాయం మాత్రం పెరిగింది. తాజాగా మద్యం ధరలను 75 శాతం పెంచిన నేపథ్యంలో అమ్ముడయ్యే మద్యం పరిమాణం కొంత తగ్గే అవకాశముంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మద్యపాన నిషేధం అమలుకు కట్టుబడి ఉన్నాం: నారాయణస్వామి