లాక్డౌన్ నిమ్మ రైతులకు నష్టాన్ని మిగిల్చింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోలేక కర్షకులు వేదనకు గురవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని దివాన్ చెరువు, శ్రీరాంపురం, శ్రీకృష్ణపట్నం, తోకడ, తదితర ప్రాంతాల్లో నిమ్మకాయ అధికంగా సాగుచేస్తారు. కరోనా ప్రభావంతో నిమ్మకాయకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిమ్మ చెట్లకు వైరస్ తెగులు
ఎప్పుడూ మార్చి, ఏప్రిల్లోనే పంటను కోస్తామని లాక్డౌన్ వల్ల పంట కోయలేకపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిమ్మచెట్లకు వైరస్ సోకి నాశనమవుతున్నాయని వాపోయారు.
పెట్టుబడి రావడం లేదు
రాజమహేంద్రవరం నిమ్మకాయ మార్కెట్ నుంచి వివిధ రాష్ట్రాలకు పంట ఎగుమతి చేస్తూ ఉంటారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా రవాణా స్తంభించి ఎగుమతులు నిలిచిపోయాయి. సరైన గిట్టుబాటు ధర లేక కనీసం పెట్టిన పెట్టుబడి సైతం రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.