పుట్టినప్పుడు బట్ట కట్టలేదు.. పోయేటపుడు వెంట తీసుకుపోయేదేమీ లేదన్నాడు ఓ సినీకవి. దానిని ఆచరించి తనకున్న దానిలో తోచిన దానం చేసి అందరి మన్ననలు పొందుతున్నారు ఈ వృద్ధ దంపతులు. కోట్ల రూపాయల డబ్బును దక్కించుకొని ఆఖరికి అనాథలకు దానం చేసిన సీన్ అరుణాచలం చిత్రంలో చూశాం.. అలాంటి సీన్ తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని కేంద్రపాలిత ప్రాంతం యానాంలో చోటు చేసుకుంది.
వృద్ధ దంపతుల ఉదారత.. ఆస్థి పేదలకు పంపకం - yanam
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఓ వృద్ధుడు పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తన భార్య పేరు మీదున్న కోటిన్నర విలువైన ఎకరంన్నర భూమిని కులమతాలకు అతీతంగా నిరుపేదలకు పంచిపెట్టాడు.
యానాంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మెల్లం సుబ్బారావు పేదలకు భూమి పంచి తన ఉదాసీనతను చాటుకున్నాడు. తాతల కాలం నాటి ఆస్థి సెంటు భూమి ఉంటేనే పంపకాలకు పట్టుపట్టే కుటుంబాలు ఉంటున్న ఈరోజుల్లో కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని గ్రామంలోని నిరుపేదలకు పంచిపెట్టాడు ఈ అరుణాచలేశ్వరుడు. 50 సంవత్సరాల కాలంలో తాను సంపాదించిన ఆస్థిని కుటుంబసభ్యులకు ఇచ్చి.. తన భార్య పేరున ఉన్న కోటిన్నర విలువైన కొబ్బరితోటను కులమతాలకు అతీతంగా.. నిలువ నీడలేని వారికి గూడు కట్టుకునేందుకు ఇచ్చేశాడు. 54 మంది లబ్ధిదారులకు అంగీకార పత్రాలను అందజేశాడు. ఎన్నోఏళ్లుగా ఇరుకైన అద్దె ఇంట్లో పిల్లాపాపలతో జీవితాన్ని కొనసాగిస్తున్న కొందరికైనా సహాయం చేయాలనే ఇలా చేశానని ఆ పెద్దాయన తెలిపారు.
నిలువ నీడ లేని తమకు గూడు కట్టుకునేందుకు స్థలం ఇచ్చిన వృద్ధ దంపతులకు పేదలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు.