తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని బూరుగుపూడి, కాపవరం గ్రామాల సమీపంలో జిల్లా యంత్రాంగం సేకరించిన ఆవ భూముల వ్యవహారం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ముంపు ప్రాంతంలో ఉన్న ఈ భూములు నివాస యోగ్యం కావన్న వాదన ఓ వైపు వినవస్తుండగా.. పరిహారం చెల్లింపుల్లోనూ అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి. అధికార పక్షంలోనూ ఈ వ్యవహారంలో అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ ప్రాంతం ఎత్తు పెంచితే చుట్టు పక్కల గ్రామాలకు ముప్పు వాటిల్లుతోందన్న అభ్యంతరాల నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు తెరపైకి వచ్చాయి. దీంతో పరిహారం చెల్లింపుల ప్రక్రియ అర్థాంతరంగా నిలిపేసిన యంత్రాంగం.. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, భూ వినియోగం సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి బృందాలను నియమించింది.
జిల్లాలో 3.74 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థల పట్టాలకు ఏడు వేల ఎకరాల భూమి అవసరమని తేల్చారు. జిల్లాలో ప్రభుత్వ భూములు రెండు వేల ఎకరాలు ఉండగా..రైతులు, డి- పట్టాదారుల నుంచి అయిదు వేల ఎకరాలు సేకరించాలని, మిగిలిన భూమి ప్రైవేటుగా సేకరించాలని నిర్ణయించారు. భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.1,750 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో కాకినాడ నగరం సమీపంలోని మడ అడవుల భూములతో పాటు కోరుకొండ మండలంలోని ఆవ భూముల వ్యవహారంలోనూ న్యాయపరమైన చిక్కులు తెరపైకి వచ్చాయి. కోరుకొండ మండలం బూరుగుపూడి, కాపవరం గ్రామాల సమీపంలో 587 ఎకరాలను సేకరించి 20 వేల మందికి పట్టాలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. సేకరించిన భూములకు 50 శాతం మేర చెల్లింపులు జరిగినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో ఈ భూముల వ్యవహారంపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. దీంతో మిగిలిన ప్రక్రియ నిలిచిపోయింది.
ముంపు సమస్యపై వీడని పీటముడి
ఆవ భూములు లోతట్టు ప్రాంతం కావడంతో గోదావరి వరదలు, భారీ వర్షాల నేపథ్యంలో ముంపునకు గురవుతాయని స్థానికులు చెబుతున్నారు. రాజమహేంద్రవరం- కోరుకొండ ప్రధాన రహదారితో పోలిస్తే 10 నుంచి 12 అడుగుల లోతున ఆవ భూములున్నాయి. ఇందులో కేవలం 6 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న భూములనే అధికారులు ఎంచుకున్నారు. ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూముల్లో ఎకరా ప్రాంతాన్ని మట్టి నింపితే రూ.45 లక్షల మేరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఎకరం భూమికి భూమి విలువతో అయ్యే ఖర్చు రూ.90 లక్షల వరకు అవుతున్నట్లు సమాచారం.
వరదల సమయంలో ఈ ప్రాంతంలో పడవలపై ప్రయాణించే వారమని.. గతంలో ఈ ప్రాంతం ముంపునకు గురైందని స్థానికులు పేర్కొంటున్నారు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం, మునగాల, బుచ్చెంపేట, సీతానగరం మండలం కూనవరం, కాటవరం గ్రామాలు లోతట్టు ప్రాంతాలు కావడంతో పూర్తిగా ముంపునకు గురైతే సుమారు 30 వేల మంది ఖాళీ చేయాల్సి వస్తుందన్నది ఆ పరిసర గ్రామాల ప్రజల వాదనగా ఉంది. వ్యవసాయ భూములకూ ముంపు ముప్పు ఉంటుందని వారు పేర్కొంటున్నారు.12 గ్రామాల ప్రజలు ఆవ భూములను ఇళ్ల స్థలాలుగా ఇవ్వకూడదని నిరసన దీక్షలు చేశారు. ఇప్పటికే ఆరు గ్రామాల ప్రజలు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేశారు. గత నెలలో తెదేపా రాష్ట్ర స్థాయి బృందం ఆవ భూముల్లో పర్యటించి ఇళ్ల స్థలాలకు కేటాయింపుపై అభ్యంతరం వ్యక్తం చేసింది.