జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనలో గెలిచినా వైకాపాతోనే తన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వైకాపాలో టికెట్టు కోసం ప్రయత్నించినా... చివరి నిమిషంలో వేరొకరికి వెళ్లిందన్నారు. జగన్, వైవీ సుబ్బారెడ్డితో టికెట్టు కోసం చర్చలు కూడా జరిగాయని ఆయన అన్నారు. కానీ తప్పనిసరై రాజేశ్వరరావుకు టికెట్టు ఇచ్చారన్నారు. ఖాళీగా ఉన్న తనను జనసేన.. వారి పార్టీలోకి ఆహ్వానించిందన్నారు. రాజోలు నియోజకవర్గంలో కాపులు ఓటింగ్ ఎక్కువ కనుక విజయం సాధించవచ్చునని ఆ పార్టీలోకి వెళ్లానని రాపాక అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గూడపల్లి పల్లిపాలెంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'గెలిచిన తర్వాత సీఎం జగన్ను కలిశాను. నీకు టికెట్టు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేకపోయామని జగన్ అన్నారు. సరే ఎలాగో గెలిచావు, కలిసి పని చేద్దామని ఆయన కోరారు. ఆ రోజు నుంచి వైకాపాతో కలిసి పని చేస్తున్నాను. నేను గెలిచిన పార్టీ(జనసేన) ఉండేది కాదు. నాకు బలగం ఉంది కాబట్టి గెలిచాను. మిగిలిన చోట్ల ఎక్కడా ఆ పార్టీ గెలవలేదు కదా. ఆ పార్టీ అధ్యక్షుడే గెలవలేకపోయాడు.