Pawan kalyan tour in East Godawari district : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజమహేంద్రవరం గ్రామీణం, కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల్లో.. వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటిస్తారు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి.. రైతులతో మాట్లాడి వారి కష్ట నష్టాలు తెలుసుకుంటారు. కడియం ఆవ, కొత్తపేట మండలం అవిడి, పి.గన్నవరం మండలం రాజుపాలెంలో దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటను పరిశీలిస్తారు. పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ మీడియాకు వివరించారు. రైతులకు అనుకూల విధానాన్ని తీసుకురావడమే జనసేన విధానమని.. పవన్ పర్యటను విజయవంతం చేయాలని జనసైనికులకు దుర్గేష్ పిలుపునిచ్చారు.
అకాల వర్షాలు, అధికార యంత్రాంగం వైఫల్యాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించడానికి, పాడైపోయిన పంటచేలను పరిశీలించడానికి, రైతులను పరామర్శించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పర్యటన కొనసాగుతుంది. విమానాశ్రయం నుంచి రాజోలు మీదుగా కడియం, ఆవ చేరుకుంటారు. స్థానికంగా పంట నష్టపోయి ఇబ్బందులు పడుతున్న రైతులతో మాట్లాడి పంటలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి కొత్తపేట నియోజకవర్గంలోని అవిడి గ్రామంలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడి నుంచి పి.గన్నవరం నియోజకవర్గం రాజుపాలెం వెళ్తారు. అక్కడ మొక్కజొన్న రైతులతో మాట్లాడుతారు. మళ్లీ అక్కడి నుంచి రాజమండ్రి చేరుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తారు. - కందుల దుర్గేష్, జనసేన ఉమ్మడి తూ.గో.జిల్లా అధ్యక్షుడు