Illegal Sand Transportation in East Godavari District: గోదావరి తీరంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రేయింబవళ్లు తేడా లేకుండా అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. నిబంధనలకు పాతరేస్తూ.. గోదారి తల్లి గుండెల్లో భారీ యంత్రాలు దింపుతున్నారు. అనుమతుల్లేకుండా నిత్యం వేల లారీల్లో ఇసుకను సరిహద్దులు దాటించేస్తున్నారు. కిలోమీటర్ల మేర లారీలను బారులు తీరుస్తూ.. నర్సరీ రైతుల వ్యాపారానికీ గండికొడుతున్నారు. అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు.. చంపేస్తామంటూ బెదిరింపులు.. ఇదీ తూర్పుగోదావరి బుర్రిలంక రేవులో జరుగుతున్న ఇసుక దందా తీరు.
Sand Smuggling in AP: గోదారి నదీ గర్భంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు.. జాతీయ రహదారికి ఇరువైపులా.. ప్రధాన కాల్వ, నర్సరీ పొలాల నుంచి రీచ్ వరకు నిలిచి ఉన్న లారీలు.. ఇసుక మాఫియాకు ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి. తూర్పుగోదావరి జిల్లా బుర్రిలంక రేవు.. ఇసుకాసురుల కబంద హస్తాల్లో చిక్కుకుంది. ఈ ర్యాంపులో తవ్వకాల గడువు మే 5న పూర్తయింది. టెండర్ల ప్రక్రియ ఖరారు కాకపోయినా అక్రమ ఇసుక తరలింపునకు కేంద్ర బిందువుగా మారింది.
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా, నిమ్మకునీరెత్తినట్లు అధికారులు
Sand Mafia in Burrilanka: అనుమతులు ముగిసినా జేపీ సంస్థ వే బిల్లులతోనే యథేచ్ఛగా రవాణా సాగుతోంది. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి సమీపంలోనే బుర్రిలంక రేవు ఉంది. అలాంటి చోట నిబంధనలను తుంగలో తొక్కి 30 అడుగులకుపైగా నదిలో ఇసుక తోడేస్తున్నారు. హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు కనీసం అమలు కావట్లేదు. గతంలో ఇక్కడ బోట్స్‌మెన్ సొసైటీ ద్వారా కూలీలు ఇసుక తవ్వుతూ జీవనోపాధి పొందేవారు. ప్రస్తుతం యంత్రాలను వాడటంతో కూలీలకు పని లేకుండా పోయింది. ఇసుక తోడేళ్లు పేట్రేగిపోతుంటే.. మైనింగ్ సహా ఇతర అధికారులు కనీసం కన్నెత్తి చూడటం లేదు.