తూర్పుగోదావరి జిల్లా అన్నంపల్లిలో గోదావరిని ఆనుకుని గట్టుకట్టి మరీ రొయ్యల చెరువులు తవ్వుతున్నారు. అధికారులు ఎన్నికల హడావుడిలో ఉండడాన్ని గమనించి ఈ పనులు చేపడుతున్నారు. అన్నంపల్లి అక్విడెక్టు సమీపం నుంచి చింతపల్లిలంక వరకు ఉన్న లంక భూముల్లో ఏడు పొక్లెయిన్లతో గుట్టుచప్పుడు కాకుండా.. వేగంగా పనులు చేసుకుపోతున్నారు. గతంలో ఈ భూములు పశుగ్రాసానికి ఉపయోగపడేవి. కూరగాయాలు కూడా సాగు చేసేవారు. కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఈ భూములపై కొంతమంది కన్నుపడడంతో ఆక్వాసాగుకు ఉపక్రమించారు.
ఐ.పోలవరం మండలానికి సాగు, తాగునీరందించే అన్నంపల్లి అక్విడెక్టుకు కూతవేటు దూరంలో ఇప్పటికే కొంతమంది జిరాయితీ భూముల్లో చెరువులు తవ్వి ఆక్వాసాగు చేపడుతుండగా.. ప్రస్తుతం ప్రభుత్వ లంక భూములను రొయ్యల చెరువులుగా మారుస్తుండడం గమనార్హం. గోదావరి వరదల సమయంలో వందలాది ఎకరాల లంకభూములు నదీపాతానికి గురవుతున్న పరిస్థితుల్లో వాటి నివారణకు ఓ వైపు ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే.. మరో వైపు అక్రమార్కులు సొమ్ము చేసుకోవడానికి నిబంధనలకు విరుద్ధంగా ఆక్వాసాగుకు ఉపక్రమిస్తున్నారు.
అక్రమ తవ్వకాలను అడ్డుకుంటాం..